ఇవి తింటే యంగ్ లుక్ మీ సొంతం!
ఏ వయస్సులోనైనా కొంత యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఉన్న వయస్సుకంటే తక్కువగా కనిపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనుభవంలో పెద్దవారిలా, వయస్సులో చిన్నవారిలా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే వయసు పెరిగే కొద్ది శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వయస్సు ప్రభావంతో వచ్చే మార్పులతో మానసికంగా ఒత్తిడికి, తీవ్రమైన నిరాశకి లోనవుతారు. చర్మంపై వచ్చే ముడతలు, నెరిసిపోతున్న జుట్టును చూసి బాధపడుతుంటారు. వాటిని దాచేందుకు ఎక్కువగా మేకప్ ద్వారా ప్రయత్నిస్తారు. కానీ కేవలం మేకప్ ద్వారానే వయస్సు ప్రభావం కనబడకుండా దాచలేము. మంచి యాంటీ ఏజింగ్‌డైట్‌తో వయస్సు పెరిగే కొద్ది కలిగే మార్పులను కొంతవరకు నియంత్రించవచ్చు.
* బ్లూబెర్రీలు తింటే నాజూగ్గా కనిపిస్తారు. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల వయసుతో వచ్చే శారీరక, మానసిక మార్పులను సులభంగా అధిగమించగలరు.
* చిలగడదుంప, కేరట్, గుమ్మడి కాయల్లో బీటా- కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఏజింగ్‌ను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. చర్మాన్ని పట్టులా ఉంచడంతో పాటు కండ్లకు ఆరోగ్యకరమైన మెరుపునిస్తాయి.
* ఆకుకూరలు తినడం వల్ల చర్మం మెరవడమే కాదు, వయసూ కనపడదు.
* కీర కూడా యాంటి ఏజింగ్ ఫుడ్. కీరలో నీరు బాగా ఉండడంవల్ల యంగ్ లుక్స్ పోవు. చర్మంపై ముడతలు పడవు.
* విటమిన్ -సి అధికంగా ఉండే బ్రొకెల్లీ తింటే చర్మం ముడుతలు పడదు. వయసుతోపాటు వచ్చే పొడిబారిపోయే చర్మగుణం కూడా పోతుంది.
* సాల్మన్ చేపలు యాంటి -ఏజింగ్‌గా బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు.
* ఆలివ్ నూనె వాడితే యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. చర్మం, శిరోజాలు మెరుస్తుంటాయి.
* బాదం పప్పును ఏ విధంగా తీసుకున్నా అందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచే లక్షణాలున్నాయి . అందువల్ల రోజూ గుప్పెడు బాదం పప్పు తీసుకోవడం చాలా మంచిది. లేదా పాలలో బాదం పప్పులను నానబెట్టి తీసుకున్న మంచి ఫలితాలు ఉంటాయి.
* ప్రతిరోజూ దానిమ్మను తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని నియంత్రించవచ్చు. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఆహారంలో దానిమ్మను వినియోగించాలి. దానిమ్మ రసాన్ని తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. షుగర్ ఉన్న వారు కూడా దానిమ్మను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
*చర్మం ఆరోగ్యంగా, కళ్లు మెరుపులీనుతూ ఉండాలంటే ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. ఆకుకూరల వాడకం వల్ల ఏ లోపం లేకుండా శరీరానికి సమృద్ధిగా విటమిన్లు అందుతాయి. అంతేగాక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి.