YV Subba Reddy: జగన్ రాజీనామాపై సుబ్బారెడ్డి కామెంట్స్
YV Subba Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నట్లు ఎప్పటి నుంచో ఓ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే దక్కడంతో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని తప్పించి తాను ఆ పదవిలో పోటీ చేయాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ రకంగా కనీసం పార్లమెంట్‌కైనా వెళ్లచ్చు అని జగన్ భావిస్తున్నారట.
మరో హాట్ టాపిక్ ఏంటంటే.. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి భార్య భారతి రెడ్డిని నిలబెట్టాలని కూడా అనుకుంటున్నారట. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడప ఎంపీ ఉప ఎన్నిక గురించి ప్రస్తావించారు. అదే జరిగితే తాను గ్రామ గ్రామానికీ తిరగి వైఎస్ షర్మిళను ఎంపీగా గెలిపిస్తానని అన్నారు. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తమ నాయకుడు రాజీనామా చేయాలని అనుకోవడం లేదని.. ఆ అవసరం తనకు ఏముందని అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే తామే ప్రకటిస్తామని వెల్లడించారు.