“కడప, కర్నూల్‌లో మర్డర్లు మామూలేగా అన్నారు”

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా కడప జిల్లా పులివెందుల్లోని వివేకా సమాధి వద్ద సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీత భావోద్వేగంతో మట్లాడారు. ”నాన్న హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారని.. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నారని.. అసలు నాన్నను ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెట్టగలను?” అని సునీత పేర్కొన్నారు. వివేకా కేసులో న్యాయం గెలవాలని.. దర్యాప్తు సంస్థలను ఎవరూ ప్రభావితం చేయకూడదని అన్నారు. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో గతంలో సిట్ కానీ, ఇప్పుడు సీబీఐ కానీ విచారణ జరుగుతున్న క్రమంలో ఏదిపడితే అది మాట్లాడటం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలను, పోలీసులను వారి పని వారు చేసుకునేలా సహకరించాలని కోరారు.

తనతోపాటు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని సునీతా అన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని చెప్పారు. కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో ఇప్పటికే సమర్పించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని తనకు కూడా తెలుసని.. కానీ హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందునే సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నట్లు సునీత వివరించారు. వివేకా కేసు విషయంలో ఎంతో మంది సహకరిస్తున్నారని… వారందరికీ సునీత కృతజ్ఞలు తెలియజేశారు.

ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించిన బాబు..
వివేకానందరెడ్డి హత్యగావించబడి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ‘జస్టిస్ ఫర్ వివేకా’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని పులివెందుల పూల అంగళ్ల దగ్గరి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు అంటూ అందులో ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు…చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి…. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత స్పందించారు.