పుట్టపర్తిలో వైసీపీ టీడీపీ నాయకుల కొట్లాట
ప్రశాంతతకు నిలయమైన పుట్టపర్తి రాజకీయ ఘర్షణలో శనివారం అట్టుడిగింది. వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల నడుమ.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్ పుట్టపర్తిలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.. పుట్టపర్తిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పుట్టపర్తి నగరంలోని సత్తెమ్మ దేవాలయంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ సవాల్ విసిరారు. శ్రీధర్‌రెడ్డి సవాల్‌ను మాజీ మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి స్వీకరించి ఇవాళ అక్కడికి వెళ్లారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి తన కారు ఎక్కి తేల్చుకుందా రా.. అంటూ తొడకొట్టి ఎమ్మెల్యేకు సవాల్ విసరడంతో… వైసీపీ వర్గం వారు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులు ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. తోపులాటలో పల్లె రఘునాథ్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
ఘటనకు కారణాలు ఇవే..
పుట్టపర్తిని అభివృద్ధి చేసింది తామేనని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించగా.. ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈక్రమంలో బహిరంగ చర్చకు సిద్దమా అంటూ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అవసరమైతే చర్చకు సిద్దమా.. అంటూ స్థానిక సత్యమ్మ ఆలయాన్ని ఇరువురు ఎంచుకున్నారు. అన్నట్టుగా మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి తన అనుచరులతో సత్యమ్మ ఆలయానికి చేరుకున్నారు. అటు ఆలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణలకు దిగగా.. పల్లె రఘునాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
పుట్టపర్తిలో పోలీస్ యాక్ట్ అమలు..
వైసీపీ టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తరుణంలో సత్యసాయి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని నాయకులను కోరారు. సత్యమ్మ గుడి దగ్గర ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు అనుమతించమని స్పష్టం చేశారు. అంతకుముందు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. ఈ ఘర్షణల్లో రెండు పార్టీలకు చెందిన నాయకుల వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.