అసమ్మతి ఎమ్మెల్యేలపై YCP వేటు.. బిగ్ షాక్ ఇచ్చిన జగన్!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా వైసీపీ నుంచి 7 మంది ఎమ్మెల్సీలు బరిలో నిల్చోగా.. టీడీపీ నుంచి ఒకరు బరిలో నిలిచారు. అయితే.. వైసీపీ ఏడు సీట్లు గెలపొందడానికి సభ్యుల బలం ఉన్నా.. ఒక సీటు కోల్పోయింది. ఇదంతా వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేల వల్ల జరిగిందని ఆ పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈక్రమంలో సీఎం జగన్ అసమ్మతి ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినట్లుగా భావిస్తున్న వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. వీరంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
అసమ్మతి ఎమ్మెల్యేలు ఏమన్నారంటే…
ఇప్పటికే ఆ పార్టీని బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అయితే.. ప్రస్తుతం మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీ అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. దీనిపై నిన్నటి నుంచి వార్తలు వస్తున్నా.. ఉండవల్లి, చంద్రమోహన్ రెడ్డి మాత్రం తాము వైసీపీకే ఓటు వేశామని చెబుతున్నారు. సీఎం జగన్‌కు ఆ మేరకు తాము హామీ ఇచ్చారని అంటున్నారు. ఇక కోటంరెడ్డి, రామనారాయణ రెడ్డి మాత్రం తమ ఆత్మప్రభోధానుసారం ఓటు వేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే వీరు మాత్రం టీడీపీకి ఓటు వేస్తారని ముందునుంచే వైసీపీ నాయకులు భావించారు. అదే విధంగా జరిగింది కూడా. అయితే ఉండవల్లి, చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా టీడీపీకి తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొనలేదు. ఈక్రమంలో ఈ నలుగురిని పార్టీ నుంచి సస్సెండ్ చేయడం సంచలనంగా మారింది. ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా సాధారణ ఎన్నికలకు వెళ్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.