స్వీయ వివాహం చేసుకుని.. 24 గంటలకే విడాకులు!
వెర్రి వెయ్యిరకాలు అని పెద్దలు ఊరికే అన్నారా? నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లు. కొన్నేళ్ల క్రితం ఓ విదేశీ మహిళ.. తనకు నచ్చిన అబ్బాయి దొరకలేదని ఓ బొమ్మని పెళ్లి చేసుకుంది. మరో యువతి తాను అందుకున్న డిగ్రీ పట్టాను పెళ్లి చేసుకుంది. మరో అమ్మాయి అయితే.. తనని తానే పెళ్లి చేసుకుంది. ఇవన్నీ విదేశాల్లో జరుగుతుంటాయనే అనుకున్నాం మొన్నటి వరకు. కానీ ఇటీవల మన దేశానికి చెందిన అమ్మాయి తనని తాను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాత్‌కి చెందిన క్షమా బిందు అనే యువతి.. నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో షో చూసి దాని నుంచి స్ఫూర్తి పొంది తనని తాను పెళ్లి చేసుకుంది.
సరే ఎవరి ఇష్టం వారిది అనుకోండి. కాకపోతే.. ఇప్పుడు చెప్పబోయే స్టోరీలోని యువతి మాత్రం అంతకుమించి షాక్ ఇచ్చింది. అసలు వివరాల్లోకెళితే.. సోఫీ మౌరే అనే ఓ విదేశీ యువతి.. తనకు నచ్చిన వ్యక్తి దొరక్కపోవడంతో ఫిబ్రవరిలో తనని తానే పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు.. పెళ్లయ్యాక వాళ్ల సంప్రదాయం ప్రకారం కేక్ కట్ చేయడానికి తనకు నచ్చినట్లుగా కేక్ కూడా తనే బేక్ చేసుకుందట. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. పెళ్లి జరిగిన 24 గంటల్లోనే తనకి తానే బోర్ కొట్టేసిందట. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాదు.. ఏదో భార్యాభర్తలు కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నట్లు.. తనతో తాను విడిపోవడానికి విడాకులకు దరఖాస్తు కూడా చేసుకుందట. ఇది చూసిన నెటిజన్లకు దిమ్మతిరిగింది. అసలు ప్రపంచం ఎటుపోతోందిరా భగవంతుడా అంటూ తలబాదుకుంటున్నారు. ఇంకొందరైతే.. విడాకులు అయ్యాక నన్ను పెళ్లి చేసుకో అంటూ ప్రపోజ్ కూడా చేసేస్తున్నారు. ఇకనైనా సోఫీ ఇలాంటి పిచ్చి పనులు మానేసి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.