సర్జరీ చేస్తేనే కదిలేది.. హాస్పిటల్‌లో మహిళ డ్రామా
సర్జరీ చేస్తేనే హాస్పిటల్ నుంచి వెళ్లేది లేకపోతే ఇక్కడే బెడ్ మీద పడుకుంటాను.. అంటూ ఓ మహిళ హాస్పిటల్ సిబ్బందికి చుక్కలు చూపించింది. అయితే ఆ మహిళ అలా చేయడానికి కారణం లేకపోలేదు. పాపం ఆ మహిళకి ఏడాదిగా నడుము నొప్పి ఉండటంతో హాస్పిటల్‌కి ఎన్నిసార్లు వెళ్లినా కూడా ఏదో ఒక చిన్న ట్రీట్‌మెంట్ ఇచ్చి ఇంటికి పంపేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకు నడుం నొప్పి తగ్గడంలేదు. ఆ తర్వాత సరైన టెస్టులు చేసిన డాక్టర్లు సర్జరీ ఒక్కటే మార్గం అని చెప్పారు. అయితే సర్జరీ చేయడానికి ఓ స్లాట్ బుక్ చేయాలని, బుక్ అయ్యాక మేమే కాల్ చేసి చెప్తాం అని డాక్టర్లు చెప్పి ఆమెను ఇంటికి వెళ్లమన్నారు. అయితే స్లాట్ బుక్ చేసే వరకు వెయిట్ చేసేది లేదని వెంటనే సర్జరీ చేసి పంపించండంటూ ఆమె మొండికేసింది. దాంతో ఏం చేయాలో తెలీని అక్కడి వైద్యులు తలపట్టుకుని కూర్చున్నారు.
ఇంగ్లాండ్‌కి చెందిన ఆండ్రినా అనే మహిళకు ఏడాది నుంచి విపరీతమైన నడుం నొప్పి ఉంది. దాంతో ఆమె వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఎం ఆర్ ఐ స్కానింగ్ తీసి నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపించేవారు. ఏడాది పాటు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా నొప్పి మాత్రం తాత్కాలికంగానే తగ్గేది. ఒకానొక సమయంలో వైద్యులు ఇక వీల్‌చైర్ మీద కూర్చోవడం బెటర్ అనేసారట. దాంతో తన జీవితాన్ని అలా గడపడం ఇష్టంలేని ఆండ్రినా.. తనకు తెలిసిన జనరల్ ఫిజిషియన్‌ను సంప్రదించింది. అతను మరిన్ని పరీక్షలు చేసి సియాటికా అనే సమస్య ఉందని చెప్పాడు. అది తగ్గడానికి మందుల డోస్ కూడా పెంచాడు. ఆ నొప్పి పూర్తిగా తగ్గాలంటే 12 వారాలు పడుతుందని చెప్పారు. ఆ నొప్పి కారణంగా తాను మల, మూత్రవిసర్జన కూడా చేయలేకపోతున్నానని, కొన్ని రోజుల పాటు బెడ్ నుంచి దిగలేకపోయానని తన డాక్టర్ వద్ద వాపోయింది.
ఇక చేసేదేంలేక తన డాక్టర్ ఓ పెద్ద హాస్పిటల్‌లో చెకప్ చేయించుకోమని చెప్పి రెఫరెన్స్ ఇచ్చాడు. ఆమె హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేయించుకోగా.. సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారట. కాకపోతే సర్జరీ చేయడానికి సరైన స్లాట్ బుక్ చేయాలని, స్లాట్ దొరికాక తామే ఫోన్ చేసి పిలుస్తామని వైద్యులు చెప్పారు. ఇందుకు ఆండ్రియా ససేమిరా అనింది. తాను నొప్పి భరించలేకపోతున్నానని, సర్జరీ చేస్తేనే ఇంటికి వెళ్తానని హాస్పిటల్‌లో భీష్మించుకుని కూర్చుంది. వైద్యులు, సిబ్బంది ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు. దాంతో ఓ బెడ్ దొరికే వరకు ఆమెను ఏకంగా 15 గంటల పాటు వీల్ ఛైర్‌లో కూర్చోబెట్టారు. దాంతో స్థానిక మీడియా వర్గాలకు విషయం తెలిసి ఆమెను సంప్రదించాయి. “ఏడాదిన్నర పాటు నడుం నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్లకు చూపిస్తే ఇప్పటివరకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి నన్ను మందులకు బానిసను చేసేసారు. ఇక నావల్ల కాదు. ఇప్పుడే సర్జరీ చేస్తే ఇన్‌ఫెక్షన్ వస్తుంది అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేసినా ఇన్‌ఫెక్షన్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఎప్పుడు సర్జరీ చేస్తే ఏంటి? ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకున్నానంటే ఇక నాకు ఈ జన్మకు సర్జరీ అవ్వదు. రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటూ ఈ డాకర్లు ఇలాగే చెప్పి పంపిస్తుంటారు. ఈసారి మాత్రం నేను సర్జరీ చేయించుకునే వెళ్తాను. ఇలా నొప్పితో బతకడం ఇక నావల్ల కాదు. ఈ హాస్పిటల్ సిబ్బంది నన్ను బయటికి పంపించడానికి పోలీసులను పిలిపించేలా ఉన్నారు. నా సర్జరీ కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాను” అంటూ తన బాధను చెప్పుకుంది.