కాబోయే భర్త.. కొడుకు వరుస అవుతాడని కానిస్టేబుల్ ఆత్మహత్య
Hyderabad: ఆమె ఒక మహిళా కానిస్టేబుల్.. గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు, బంధువులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఏదీ సెట్ కావట్లేదు. వచ్చినవి రద్దవుతున్నాయి. కొన్ని ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లగా.. మరికొన్ని మధ్యలోనే నిలిచిపోతున్నాయి. తీరా ఇటీవల ఓ సంబంధం ఫిక్స్ అవగా.. తీరా అతను కొడుకు వరస అవుతాడని పెద్దలు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తనకు పెళ్లి యోగం లేదని భావించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్‌లోని శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు జైతారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె సురేఖ(28)… కానిస్టేబుల్‌గా ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. చెల్లితో కలిసి కాల్వగడ్డలో అద్దె ఇంట్లో ఉంటోంది. సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగి అనివార్య కారణాల వల్ల రద్దయ్యింది. తాజాగా తన స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి కుదిరింది. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. అయితే.. నిశ్చితార్థం జరిగాక పెళ్లి కుమారుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడని.. అలా ఎలా పెళ్లికి ఒప్పుకున్నారని పెద్దలు చెప్పారు. ఇద్దరి జాతకాలు కూడా కుదరడం లేదని.. బంధువులు చర్చించుకుంటుండటంతో ఆమె ఆందోళన చెందింది. ఇక ఈ పెళ్లి కూడా జరగదేమోనని తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 2న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి యజమాని విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.