GIS- విశాఖ నుంచే ప‌రిపాల‌న‌: జ‌గ‌న్

విశాఖ‌ప‌ట్నంలో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మిట్ అట్ట‌హాసంగా జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రసంగం ఇచ్చారు. దేశ ప్ర‌గ‌తిలో ఏపీ ఎంతో కీల‌కంగా మారింద‌ని అన్నారు. ఏపీలో నీటి వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని.. రాష్ట్రంలో దాదాపు 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు వేదిక కాబోతోందని తెలిపారు. “రాష్ట్రంలో 20 కీల‌క రంగాల్లో 6 ల‌క్ష‌ల మందికి ఉపాది క‌ల్పించేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. ఈరోజు వివిధ సంస్థ‌ల‌తో 92 ఒప్పందాలు జ‌రిగాయి. 340 సంస్థ‌లు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి. మ‌రో 4 పోర్టులు రాబోతున్నాయి. పోర్టుల‌కు స‌మీపంలో భూములు ఉన్నాయి. ఏపీలో నైపుణ్యం క‌లిగిన యువ‌త‌కు కొద‌వ లేదు. రాష్ట్రం నుంచి ఎగుమ‌తులు గ‌ణ‌నీయంగా ఉన్నాయి. భౌగోళికంగా పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. విశాఖ త్వ‌ర‌లో ప‌రిపాల‌న రాజ‌ధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాల‌న చేయ‌బోతున్నాను. త్వ‌ర‌లోనే ఇది సాకారం అవుతుంది.” అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా రిల‌య‌న్స్ సంస్థ‌ల అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడారు. ఏపీలో త‌మ సంస్థ నుంచి పెట్టుబ‌డులు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. సంస్క్ర‌తి, సంప్ర‌దాయాల‌కు ఏపీ నిల‌యమ‌ని, ఏపీలో కీల‌క రంగాల్లో వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుంటుంద‌ని కొనియాడారు. “సీఎం జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఏపీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఏపీ రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఏపీలో జియో నెట్‌వ‌ర్క్ వేగంగా డెవ‌ల‌ప్ అయింది. సోలార్ విద్యుత్ రంగంలో రిల‌య‌న్స్ పెట్టుబ‌డులు పెడుతుంది.” అని అంబానీ తెలిపారు.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. “ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్‌ ఇండస్ట్రీపై సీఎం జగన్‌ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో ఉంద” అని అన్నారు.

జిందాల్ స్టీల్ ఛైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. “ఏపీలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. తద్వారా 10 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్క‌డ మౌలిక వసతులు కూడా అద్భుతంగా ఉన్నాయి. గత అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో మాకు ఉన్న సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మేము భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాము. ఏపీలోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన యువత, అద్భుతమైన వ్యాపార అనుకూల వాతావరణం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రభుత్వ విధానాలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు