అమరావతి కోసం అసెంబ్లీకి చంద్రబాబు?
మార్చి 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఎంవో ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తోపాటు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుందని సమాచారం. అయితే.. అమరావతి రైతుల కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలోకి ఈసారి అడుపెడతారా? రాజధాని బిల్లును అడ్డుకుని ప్రశ్నిస్తారా అన్న విషయాలపై టీడీపీ నుంచి ఇప్పటికైతే స్పష్టత లేదు. అమరావతి రైతులు మాత్రం అసెంబ్లీలో బిల్లు పెట్టినా.. తమ పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. ఇక సీఎం జగన్ తత్వం అందరికీ తెలిసిందే తాను ఏది అనుకుంటే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసి తీరుతాడు. మరి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి… రాజధానుల విషయంలో వైసీపీ వైఖరి ఏంటి అన్నదానిపై మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
చంద్రబాబు రావడం కష్టమే.. అయితే..
గత ఏడాది జరిగిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తన భార్యను అవమానించారని.. ఆవేశంగా మాట్లాడుతూ సభ నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అంటూ వాపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని శపధం చేశారు. అయితే.. రాష్ట్ర బడ్డెట్ ప్రవేశపెట్టే తరుణంలో ప్రభుత్వ లోపాలను ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షనేతగా చంద్రబాబుపై ఉంది. కానీ ఆయనకు జరిగిన అవమానం బట్టి చూస్తే.. సభకు వచ్చే సూచనలు కనిపించట్లేదు. మరోవైపు చంద్రబాబు కలల రాజధాని అమరావతి కాదని… సభలో మూడు రాజధానుల బిల్లును వైసీపీ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కనీసం దీన్నైనా చంద్రబాబు అడ్డుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
అమరావతి రైతులు ఎమంటున్నారంటే..
అమరావతిని మూడుగా విభజిస్తూ వైసీపీ ప్రభుత్వం చేయాల్సింది చేస్తూ ఉంటే చంద్రబాబు కచ్చితంగా అసెంబ్లీలో ఉండి అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అమరావతి రైతులు కోరుతున్నారు. బాబు అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని వారు అంటున్నారు. అమరావతి ప్రాముఖ్యాన్ని సభ ద్వారా ప్రజలకు వివరిస్తే ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్తుందంటున్నారు.