Pawan Kalyan: సినిమాలపై ఉన్న ఫోకస్..రాజకీయాలపై లేదే..?
vijayawada: పవన్ కల్యాణ్( pawan kalyan) రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరో. అయితే.. పదేళ్ల కిందట జనసేన(janasena) అనే పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ క్రమంలో రెండు దఫాలు ఎన్నికలు రాగా.. ఓట్లు రాబట్టుకున్నారు. కానీ సీట్లను పొందలేకపోయారు. ఆయన సినిమాలను ఇష్టపడే అభిమానులు.. ఓటు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని ఇటీవల పలుమార్లు పవన్ కల్యాణ్ బహిరంగ వేదికల్లోనే ప్రస్తావించారు. ఇక మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో పవన్ ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. వైసీపీ(ycp), టీడీపీ(Tdp) నాయకులు ఇప్పటికే ప్రజల మధ్య ఉంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ పలు వేదికలపై నుంచి చెబుతున్నా.. ఆ దిశగా ప్రజల్లోకి వెళ్లి తన పార్టీకి ఓటు వేయాలని అడగటం లేదు. మరోవైపు బీజేపీ, టీడీపీ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారాయి.
పవన్ పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేదు. ఆ దిశగా కూడా అడుగులు పూర్తి స్తాయిలో పడలేదు. ఇక పవన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నారు. దీనికి కారణం.. త్వరలో ఆయన చేపట్టబోయే వారాహి వాహనం(varahi vehicle)పై ప్రచారానికి, రానున్న ఎన్నికల్లో కొంత డబ్బుని సమకూర్చుకునే పనిలో ఉన్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇవన్నీ అభిమానులను సంతృప్తి పరచవచ్చు. కానీ న్యూట్రల్‌గా ఉండే ప్రజలు, వివిధ వర్గాల వారు అర్థం చేసుకోలేరు. కేడర్‌లో కూడా తమ నాయకుడు ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు అన్నది కూడా చెప్పుకోలేని దుస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది కార్యకర్తలు, నాయకులు పవన్ తీరుపై నిరుత్సాహంతో ఉన్నారని సమాచారం. ప్రత్యర్థి పార్టీలు పవన్‌ను పార్టైమ్ పొలిటీషియన్ అనడం వంటి వాటికి అభిమానులు కొంత నొచ్చుకుంటున్నారు.