ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCPకి వ్యతిరేక పవనాలు.. TDPకి లాభ‌మేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. దీంతోపాటు ప్రజలు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం అన్ని పార్టీలు సమీక్షించుకునే పనిలో పడ్డాయి. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయకేతం ఎగురవేసింది. స్థానిక సంస్థల్లో కేవలం ఎంపీటీసీ, జడ్పీటీసీలే ఓటు వేసే అవకాశం ఉండటంతో అందరూ అనుకున్నట్లే అధికారపార్టీ వాటిని కైవసం చేసుకుంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తాయని అందరూ భావించారు. ఎందుకంటే.. అధికార ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోవట్లేదని, వారికి పనిభారం కూడా విపరీతంగా పెంచిందని.. పెండింగ్‌ బకాయిలు సైతం విడుదల చేయట్లేదని కొంత వైసీపీపై వ్యతిరేకత ఉంది. కానీ ఇవన్నీ ఎన్నికలను ప్రభావం చూపలేదు. అయితే ఈ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు సైతం ఓటు హక్కు కల్పించడంతో కొంత వైసీపీకి అనుకూలంగా ఆ ఓటింగ్‌ పడిందని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉపాధ్యాయులపై దృష్టి సారించి వారి ఓట్లు సంపాదించడంలో సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. కానీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి? యువకులు, చదువుకున్న వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా.. ? లేదా టీడీపీ నిజంగా పుంజుకుందా అన్న అంశాలపై ప్రత్యేక కథనం.

వైసీపీకి యువతరం షాక్‌ ఇచ్చిందా..
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో అధికార వైసీపీకి యువత భారీ షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుపై తమ అభిప్రాయం ఏంటో ఈ ఎన్నికల్లో వారు స్పష్టంగా చెప్పారు. పట్టణాల్లో, యువత, విద్యావంతులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. యువతకు ఉపాధి, అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపట్టాలని ప్రభుత్వానికి తమ ఓటు ద్వారా పట్టభద్రులు తెలియజేశారు. అయితే వైసీపీ మాత్రం పట్టభద్రుల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి అని.. పైగా మొత్తం కలిసి ఆరు లక్షల ఓటర్లు కూడా ఉండని ఎన్నికల్లో ఓడిపోతే పెద్దగా కోల్పేయేది ఏమీ లేదని చెబుతున్నా.. విద్యావంతుల్లో ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో సమీక్షించుకోవాల్సిందే. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో టార్గెట్‌ 175 అని చెబుతున్న సీఎం జగన్‌… క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఇప్పటికైనా ఐప్యాక్‌ టీంతో అయినా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు సంక్షేమ పథకాలు పేద వర్గాలకు అందుతుండటంతో.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ వైపే ఉన్నారని అధికార పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పుకొస్తోంది.

పట్టున్న చోట కూడా వ్యతిరేకత..
రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని వైసీపీ ముందు నుంచి చెబుతోంది. అయితే.. ఎన్నికల్లో మాత్రం ఈ అంశాన్ని యువత పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రలోనే కాదు… వైసీపీకి పట్టు ఉంది అనుకున్న తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలోనూ ఓడిపోవడం.. ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల గురించి చెప్పనవర్లేదు. ఈ మూడు జిల్లాలకు కలిపి టీడీపీకి ఉన్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు. వారు కూడా అనంతపురం జిల్లా నుంచే గెలుపొందిన వారే. ఇక్కడ వాస్తవంగా ఏకపక్షంగా పట్టభద్రులు వైసీపీకి పట్టం కట్టాలి కానీ అలా జరగలేదు. దీన్ని టీడీపీ అడ్వాంటేజ్‌గా మార్చుకుని ప్రచారం చేసుకుంటోంది. రాయసీమలోని పులివెందులలో కూడా టీడీపీ జెండా ఈ సారి ఎగురవేస్తామని సవాలు విసురుతోంది.

సీఎం జగన్‌ సమీక్షించుకోవాల్సిందే..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంపై సీఎం జగన్‌ సమీక్షించుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన వైసీపీ.. సాధారణ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరుగుతాయి అనగా.. ఓటమి పాలు కావడం ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి. వాస్తవానికి సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏపీకి కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉపాధి అవకాశాలు పెరగలేదు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పైగా గతంలో వచ్చిన పరిశ్రమలు సైతం రాష్ట్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతున్నాయి అంటూ ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఆరోపణలు చేస్తున్నాయి. జగన్‌ 2019 ఎన్నికల ప్రచారం వేళ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. కానీ వాస్తవంగా వచ్చే సరికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయక, ప్రైవేట్‌ కంపెనీల్లో అవకాశాలు లభించకపోవడంతో యువతలో వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. కేవలం సంక్షేమం చుట్టూ వైసీపీ ఆలోచించడం, ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేయడానికి సమయం కేటాయిస్తోందనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టెమెంట్‌ సమ్మిట్‌ గ్రాండ్‌ సక్సెస్‌ చేశాం అని చెబుతున్నప్పటికీ.. అవి ఎప్పటికే కార్యాచరణ చేస్తాయో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా జగన్‌ సర్కార్‌ కళ్లు తెరిచి దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోతే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అవ్వక తప్పదని విశ్లేషకుల మాట.