ఇకపై ఉద్యమం ఉధృతం చేస్తాం – APJAC ఉద్యోగుల సంఘం

ఏపీలో ఉద్యోగులు గత నెల రోజులుగా ఆందోళనలు చేపడుతున్నా.. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని, కనీసం పట్టించుకోవట్లేదని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన తమ నిరసనలకు ప్రభుత్వం వైపు నుంచి చలనం లేకపోవడంతో మలి విడత ఉద్యమ కార్యాచరణని ఆయన ప్రకటించారు. ఇప్పటిదాకా.. శాంతియుతంగానే పోరాటం చేశామని, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మలివిడత పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. మే నెలలో ఉద్యమాన్ని కీలక దశకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా విజయవాడ నగరంలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ.. రెండో దశలో తాము చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా..

ఏప్రిల్‌ 6-29 : నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్ర వ్యాప్తంగా విధులకు హాజరు.

ఏప్రిల్‌ 8: నల్ల కండువాలు ధరించి .. ఉద్యోగుల డిమాండ్లతో పోస్టర్ల ఆవిష్కరణ.

ఏప్రిల్‌ 10: అన్ని జిల్లాల కలెక్టరేట్లలో స్పందన కార్యక్రమంలో నల్ల మాస్కులు ధరించి కలెక్టర్లకు మెమోరాండం సమర్పణ.

ఏప్రిల్‌ 11: సెల్‌ డౌన్‌ కార్యక్రమం.

ఏప్రిల్‌ 12: కలెక్టరేట్ల దగ్గర ఉద్యోగులు, పెన్షనర్ల ధర్నాలు.

ఏప్రిల్‌ 15: మరణించిన సీపీఎస్‌ ఉద్యోగులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబాల పరామర్శలు

ఏప్రిల్‌ 18: సీపీఎస్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నాలు.

ఏప్రిల్‌ 20: ఈఎంఐల మీద ఒత్తిడి చేయవద్దని, పెనాల్టీలు వేయవద్దని కోరేందుకు బ్యాంకుల సందర్శన.

ఏప్రిల్‌ 25: కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ధర్నాలు.

ఏప్రిల్‌ 27: పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఇళ్లను సందర్శించి.. ఆలస్యంగా వస్తున్న పెన్షన్‌ సమస్యలపై పరామర్శ.

ఏప్రిల్‌ 29: కలెక్టరేట్ల ఎదుట గ్రామ, వార్డు సచివాయాల ఉద్యోగుల సమస్యలపై ధర్నాలు.

ప్రభుత్వం నుంచి స్పందన కరువు..
మొదటి దశలో ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు ఆందోళనలను చేపట్టామని ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఛైర్మన్‌ బొప్పరాజు తెలిపారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదన్నారు. ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు, సీపీఎస్‌ ఉద్యోగుల 10 శాతం వాటా సొమ్మును బ్యాంకు ఖాతాలలో వేసినట్టుగా మొక్కుబడిగా చూపి ఉద్యోగులను మభ్య పెడుతున్నారన్నారు. ఇక ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నికర ఆదాయం రూ. 1.20 లక్షల కోట్లలో రూ. 90 వేల కోట్ల ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సరిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. జీతాలకు, పింఛన్లకు రూ.74 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. 11వ పీఆర్‌సీ నివేదిక వచ్చినా.. పదో పీఆర్‌సీ జీతాలనే ఇప్పటికీ అమలు చేయడం దురదృష్టకరమన్నారు. సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాడాతామని విశాఖలో ఏపీసీపీఎ్‌సఈఏ తలపెట్టిన ‘ఉప్పెన’కు మద్దతు తెలిపి అందులో పాల్గొంటామన్నారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు మలివిడత షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నామని, మే నెలలో విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో విడతల వారీగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనంతరం చలో విజయవాడ కార్యక్రమాలను చేపడతామన్నారు.