Ambedkar statue: విశ్వమానవుడి రూపం ప్రతిష్టించుకున్నాం
Hyderabad: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన.. ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం (ambedkar statue) ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో (Grandson of Dr. br ambedkar prakash ambedkar) కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana cm kcr) విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేడ్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్ అంబేడ్కర్ సందర్శించారు. ఈ సందర్బంగా అంబేడ్కర్ విగ్రహంపై హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం కురిపించిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు తెలిపారు. అంబేడ్కర్ పేరుతో తెలంగాణ సర్కార్ ఏటా అవార్డులు అందజేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీని కోసం రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. బీఆర్ అంబేడ్కర్ విశ్వ మానవుడని, ఆయన సిద్ధాంతం విశ్వజనీయం, సార్వజనీనమని కేసీఆర్ అన్నారు. ఎవరో అడిగితే అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదని, విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామన్నారు. అంబేడ్కర్ సిద్ధాంతాలు గుర్తుకొచ్చేలా ఏర్పాట్లు చేశామని, తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహమని సీఎం చెప్పారు. బీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత దళితుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ వెల్లడించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకాష్ అంబేడ్కర్ చెప్పారు.