వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి
దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆదివారం రాత్రి నిమిషాలకు మృతిచెందింది. నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ప్రాణాపాయ స్థితిలోనే ఉన్న ఆమె రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె బ్రతకడానికి ఒక్క శాతం ఛాన్స్ మాత్రమే ఉందని మంత్రి ఎర్రబెల్లి చెప్పిన కొన్ని గంటలకే ప్రీతి మృతి చెందారు. ఆమె మృతితో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు బంద్ కు పిలుపునిచ్చారు. కాగా, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి ఈ నెల 22న ప్రాణాంతక ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితికి చేరుకున్న ప్రీతిని తొలుత వరంగల్ ఎంజీఎంకి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకొచ్చారు. తొలుత వెంటిలేటర్‌పై.. అనంతరం ఎక్మో యంత్రంపై చికిత్స అందించారు. ఆమెను బతికించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదని మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ ఆదివారం రాత్రి ప్రకటించారు.
బంధువుల ఆందోళన..
తమకు న్యాయం జరిగే వరకు ప్రీతి మృతదేహాన్ని తీసుకుపోబోమని ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో నిమ్స్‌లో అర్ధరాత్రి వరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్ చేసిన తర్వాతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేందర్ కోరారు. మరణానికి కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకుంటామని, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానన్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి.
ప్రముఖుల సంతాపం..
ప్రీతి కుటుంబసభ్యులను భాజపా ఎమ్మెల్యే ఈటల, ఎంపీ కవిత, లంబాడీల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్‌కుమార్ జాదవ్ పరామర్శించారు. ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని చెప్పారు. ప్రీతి మృతిపై మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, తలసాని, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సంతాపం వ్యక్తంచేశారు. ప్రీతి మృతి తన మనసును తీవ్రంగా కలిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తంచేశారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రీతి మృతిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైతెపా అధ్యక్షురాలు షర్మిల సంతాపం తెలిపారు. ర్యాగింగ్‌కు నిరసనగా సోమవారం వైద్య, విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు ఏబీవీపీ తెలంగాణ శాఖ పిలుపునిచ్చింది.