ప్రైవేట్ దిశగా విశాఖ ఉక్కు.. వ్యూహాత్మకంగా కేంద్రం అడుగులు!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గత కొంతకాలంగా అక్కడి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా వామపక్ష పార్టీలతోపాటు, జనసేన, టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా విశాఖ ఉక్కు ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయవద్దంటూ.. ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. ఈక్రమంలో మరోసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి వచ్చింది. స్టీల్ ప్రైవేటీకరణ విషయమై రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తధ్యమని ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది. ఉద్యోగుల ఆందోళన తన దృష్టికి వచ్చిందని తెలిపింది. అయినా కూడా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం చెప్పేసింది.
కేంద్రం ఆలోచన ఇదే..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రేషనలైజేషన్ పేరు చెప్పి.. ఉద్యోగుల నియామకాలను పూర్తిగా నిలిపివేసింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలను దృష్టిని మరల్చుతూ… పరోక్ష పద్ధతులను కేంద్రం ఎంచుకుంది. నేరుగా ఎలాంటి ఆదేశాలు లేకుండా.. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని నిర్ణయాలు అమలవుతున్నాయి. గతంలో ఏటా 200 నుంచి 300 మందిని వరకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీలను రిక్రూట్ చేసుకునేవారు. ప్రస్తుతం ఈ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది. దీని ద్వారా ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మూడేళ్ల కిందట విశాఖ ఉక్కులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు కలిపి 17,000 మంది వరకు ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 14,880కి తగ్గిపోయింది. అంటే.. దాదాపు 13 శాతం తగ్గిపోయారు. గత ఏడాది నుంచి కేవలం ఒక్కరికే విశాఖ ఉక్కులో ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణకు స్పష్టమైన సంకేతాలని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు ఏటా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు… మరోవైపు యాజమాన్యం విధానాలు నచ్చక రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారితో కర్మాగారం ఖాళీ అవుతోంది. అయినా కూడా కొత్తవారిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. దీంతో ఆ ప్రభావం అంతా ఉత్పత్తిపై పడుతోంది. చివరికి ఉత్పత్తి తగ్గిపోయింది.. లాభాలు లేవు అని కేంద్రం చెబుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.
పోరాటాల ఫలితమే విశాఖ ఉక్కు..
ఎన్నో పోరాటాలు, బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది. అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో తెలుగువారి ఉద్యమం చేపట్టడంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. తొలి నుంచి కేంద్రం కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నా.. ఆటుపోటులు ఎదుర్కొంటూనే ఈ ప్లాంట్ లాభాలను తెచ్చిపెడుతోంది. దీంతోపాటు నాణ్యమైన ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అలాంటి సంస్థను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడం దారుణమని ఉద్యోగ సంఘాల నేతలు బీజేపీపై మండిపడుతున్నాయి. దీనిని అడ్డుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. అయినా కేంద్రం వాటిని పట్టించుకోని పరిస్థితి. లాభాలు తెచ్చిపెడుతున్న సంస్థను.. నష్టాల్లోకి నెట్టి ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోందని.. సమాచారం. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరగకుండా అడ్డంకులు సృష్టిస్తోందని అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్‌ను నమ్ముకునే కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రైవేటుపరం చేయడం సమంజసం కాదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.