వైద్యుల నిర్లక్ష్యం.. చెయ్యి కోల్పోయిన మహిళ!
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. ఓ మహిళ పాలిట శాపంగా మారింది. చేతికి ఏదో పురుగు కుట్టడంతో చిన్న గాయంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు.. ఇక్కడి వైద్యులు అందించిన వైద్యంతో ఇప్పుడు చెయ్యి తీసేయాల్సిన పరిస్థితికి వచ్చింది. చేతికి కట్టు వేసేటప్పుడు.. ఆ డాక్టర్ కట్టులోనే సర్జికల్ బ్లేడ్ మర్చిపోవడంతో చేతికి ఇన్‌ఫెక్షన్ సోకింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందిన నందిపాం సురేష్ భార్య…. తులసి (22) తన ఇంట్లోని సామాన్లు సర్దుకుంటున్న తరుణంలో ఏదో పురుగు కుట్టింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తులసి చేతిని పరిశీలించిన డాక్టర్లు… ఇన్ఫెక్షన్ సోకిందని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ డాక్టర్లు చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ తొలగించి కట్టు (డ్రెస్సింగ్) కడుతూ అందులో సర్జరీ కోసం ఉపయోగించే బ్లేడు మరిచిపోయి కట్టు వేశారు. దీంతో చేతికి మనికట్టు వరకు.. పూర్తిగా ఇన్ఫెక్షన్ పాకింది. దీంతో ఆందోళన చెందిన మహిళ మళ్లీ ఆసుపత్రికి రాగా.. కట్టు తీసే క్రమంలో బ్లేడ్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో చేయి (మనికట్టు వరకు) తీసివేయాలని చెప్పడంతో.. తులసి షాక్‌కి గురైంది. వైద్యులు చేసిన తప్పిదానికి తాను చేయి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తులసికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పైగా నిరుపేద కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి. దీంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందించి.. చేయి తీయకుండా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.