లోకేష్‌తో వంగవీటి రాధా భేటీ.. కాపులు జనసేనకు దూరమవుతున్నారా?
వంగవీటి మోహనరంగా ఈ పేరు వింటే ఓ వర్గం ఉప్పొంగుతుంది. వారికి కొండంత ధైర్యం వస్తుంది. మరోవైపు పేదల కష్టాలు తెలుసుకుని వారి పెన్నిధిగా నిలిచిన ఆ మహా నేత గురించి ఇప్పటికీ చిరస్థాయిలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు చెబుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రీయాశీలకంగా ఎదుగుతూ.. ఎంతో మంది ప్రజల మద్దతు కూడగట్టుకున్న రంగా.. కొన్ని పరిణామాల దృష్ట్యా అప్పట్లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానాన్ని రంగా కుమారుడు వంగవీటి రాధాబాబు కొనసాగిస్తూ వస్తున్నారు. తండ్రికి ఉన్న పేరు ప్రఖ్యాతలతో అందరికీ పరిచయమైన రాధా.. రంగా ఆశయాల సాధనకు కృషి చేస్తూ వస్తున్నారు. అయితే.. ఆయన గత కొంతకాలంగా పలు పార్టీలు మారుతూ వచ్చారు. దీంతో రాధా నిలకడలేని రాజకీయ నాయకుడని పలువురు భావిస్తుండగా.. ఆయన మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా పార్టీలు మారాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే… ఇటీవల రాధా జనసేనలోకి వెళ్తారని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది మార్చి 14న నిర్వహించే జనసేన ఆవిర్భావ సభ సందర్బంగా పవన్‌కల్యాణ్ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన కార్యకర్తలు భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లూతూ.. మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో రాధా భేటీ అయ్యారు. దీంతో టీడీపీలోకి రాధా వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన కాపు నాయకులు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.. ఆయనతోపాటు గుంటూరుకు చెందిన మరో కాపు నేత తోట చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరి అధ్యక్ష పదవి చేపట్టారు. జనసేన పార్టీ కావాలనే కాపులను దూరం పెడుతుందా? నాదెండ్ల మనోహర్ ప్రవర్తన ఎవరికీ నచ్చట్లేదా? అనే అంశాలపై ప్రత్యేక కథనం.
నాదెండ్ల మనోహర్ వైఖరి ఎలా ఉందంటే..
జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీరు సరిగా లేదని.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తోట చంద్రశేఖర్, తదితర నాయకులు బహిరంగంగా ఆరోపించారు. మనోహర్ పార్టీ వ్యవహారాలు అన్నీ చూస్తున్నారని.. కోటరీ ఏర్పాటు చేసుకుంటున్నారని పలు విమర్శలు సైతం ఆయనపై ఉన్నాయి. అయితే.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన నాటి నుంచి తన అన్న చిరంజీవి వెనుక ఉన్న పవన్ కల్యాణ్ కు ఇలాంటివి కొత్తేమే కాదు. ప్రజారాజ్యంలో ఎందరో నాయకులు ఆ పార్టీని తిట్టి బయటకు వెళ్లారు. అవన్నీ దగ్గరి నుంచి చూసిన పవన్.. అంత సులువుగా ఎవరినీ నమ్మి.. పార్టీలోకి ఎవరినిపడితే వారిని ఆహ్వానించే ఆలోచనలో లేరని చెప్పవచ్చు. జనసేనాని గతంలో పలు వేదికల్లో నాదెండ్ల మనోహర్ గురించి ప్రస్తావించారు. నాదెండ్లకు ఉన్న కమిట్ మెంట్, ఆయనకున్న అనుభవం నచ్చి జనసేనలోకి వచ్చారని.. ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పవన్ తెలిపారు. అయితే.. ప్రతి పార్టీలో కొందరికి నచ్చిన వారు ఉంటారు.. నచ్చని వారు ఉంటారు.. అదే విధంగా నాదెండ్ల మనోహర్ కూడా అందరికీ నచ్చట్లేదని జనసేన పార్టీలోని కొందరు నాయకులు చెబుతున్న మాట. అయితే… గతంలోనే కన్నా లక్ష్మీనారాయణ, వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. అయినా వారు టీడీపీ వైపు ఆసక్తి చూపించారు. దీంతో కాపు నాయకులు దూరమవడంలో మనోహర్ తప్పిదం ఏమాత్రం ఉండదని భావించవచ్చు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయని అందుకే నచ్చిన పార్టీలో చేరుతున్నారని జనసేన నాయకులు లైట్ తీసుకుంటున్నారు.
టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయనే ఇలా చేస్తున్నారా..
వాస్తవానికి జనసేన కంటే.. టీడీపీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు, డబ్బు పరంగా చూసుకున్నా.. వారిదే బలగం ఎక్కువ. దీంతో ఎవరైనా ముందు టీడీపీలో చేరేందుకు సుముఖత చూపుతారు. మరోవైపు పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం కూడా కొంత ఆ పార్టీలోకి ఎవరూ చేరట్లేదని అనుకుంటున్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని.. దీంతో తాము ఈ రెండు పార్టీలలో ఎక్కడుంటే.. ఏంటని టీడీపీలో చేరుతున్న నాయకులు భావిస్తున్నారు. అయితే.. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా, రాధా.. పవన్ వెంట ఉండాలి కానీ.. చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు కొంత వారిపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. మరి రానున్న ఎన్నికల్లో జనసేన మద్దతు టీడీపీలో చేరుతున్న కాపు నాయకులకు ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు త్వరలో జనసేన ఆవిర్భావ సభ జరగనున్న నేపథ్యంలో ఈనెల 12న కాపు సంఘాల నాయకులతో జనసేనాని పవన్ భేటీ కానున్నారు. ఇక ఈ సమావేశంలో కాపుల నుంచి పవన్ ఏం కోరుకుంటున్నారు.. లేదా పవన్ నుంచి కాపులు ఏం కోరుకుంటున్నారు అన్న అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.