క్యాన్సర్, హృద్రోగాలకు త్వరలో వ్యాక్సిన్లు!

కరోనా ప్రభావంతో దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్‌ అంటే ఏంటి, ఏవిధంగా పనిచేస్తుంది అన్నదానిపై స్పష్టత వచ్చింది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో సాయపడటంతోపాటు, వ్యాధిని తగ్గించే విధంగా టీకాలను రూపొందించారు. ఈనేపథ్యంలో ఇతర ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టేలా, రోగ నిరోధక శక్తిని హరించే వ్యాధులను నివారించే లక్ష్యంతో కొత్తరకం టీకాలను 2030 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మోడర్నా ఫార్మా కంపెనీ తెలిపింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో కేన్సర్‌, హృద్రోగాలు, రోగ నిరోధక శక్తిని హరించే వ్యాధులతో పాటు అరుదైన వ్యాధులకు వ్యాక్సిన్లు తీసుకోస్తామని ఈ కంపెనీ చెబుతోంది. సదరు వ్యాక్సిన్లు ప్రయోగ దశలో మంచి ఫలితాలను ఇచ్చాయని మోడర్నా ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో అన్ని రకాల వ్యాధులకు తమ కంపెనీ వ్యాక్సిన్లు రూపొందిస్తుందని మోడర్నా ఫార్మా కంపెనీ చీఫ్‌ మోడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పాల్‌ బుర్టోన్‌ తెలిపారు. పేరొందిన కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన సదరు ఫార్మా కంపెనీ ప్రస్తుతం వేర్వేరు రకాల కేన్సర్‌ కణితులు లక్ష్యంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది.