Viral News: ఒక్క బర్గర్​ ధర 55 వేలు!

America: చాలామంది ఇష్టపడే ఫాస్ట్​ఫుడ్​లలో ఒకటి  ‘బర్గర్’(Burger). ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న బర్గర్​ ఒకప్పుడు వెస్ట్రన్ దేశాల్లో ఎక్కువగా అమ్ముడయ్యేది. కానీ ఇప్పడు భారత్ లోనూ చిన్నా పెద్ద తేడా లేకుండా బర్గర్​కి ఫ్యాన్స్​ ఉన్నారు. తక్కువ సమయంలో తయారవడం, రుచి, అందుబాటులో ఉండే ధరతో ఇది ఆహార ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అయితే పోటీప్రపంచంలో తమకంటూ ప్రత్యేకత ఏర్పరచుకునే ప్రయత్నంలో రకరకాల ఆహార పదార్థాలు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మాత్రం ఓ బర్గర్ ధర భయపెడుతోంది. ఏకంగా 700 డాలర్లు అంటే రూ. 55,000 కంటే ఎక్కువ ధరలతో ‘డ్రూరీ బీర్ గార్డెన్’ అనే రెస్టారెంట్ ఈ సరికొత్త చీజ్ బర్గర్ ను తీసుకువచ్చింది.

‘గోల్డ్ స్టాండర్డ్ బర్గర్’(Gold Standard Burger) పేరుతో ఈ సరికొత్త కాస్టీ బర్గర్ ను ఈ రెస్టారెంట్ తీసుకువచ్చింది. మిడ్ టౌన్ విలేజ్ లో కొత్తగా రీఓపెన్ చేసిన రెస్టారెంట్ లో ఈ బర్గర్​ అందుబాటులో ఉంది. డ్రూరీ బీర్ గార్డెన్ రెస్టారెంట్ మే 19న ప్రారంభించారు. నాణ్యమైన పదార్థాలను ఈ బర్గర్ తయారీలో వాడటంతో ఇంత ధర పలుకుతోంది. ప్రపంచంలోనే నాణ్యమైన బీఫ్ మాంసం అయిన ‘వాగ్యు స్టేక్’ తో పాటు ఐరిష్ చెద్దార్, హనీ, కాల్చిన లోబ్ స్టర్, ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ బర్గర్ లోపల ఉంచుతారు. బ్రియోచీ బన్ ను బంగారు కవర్ తో అలంకరించి ఈ బర్గర్ ను తయారు చేస్తారు. మనుకా తేనెతో చేసిన ఫ్రైస్ తో ఈ బర్గర్ ను అందిస్తారు. మీకూ తినాలని ఉందా..ఇంకెందుకు ఆలస్యం అమెరికా వెళ్తే ట్రై చేసేయండి!