నెటిజన్‌ ట్వీట్‌.. అధికారులకు KTR ఆదేశాలు!

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. ఓ నెటిజన్‌ పెట్టిన వీడియోకి రీసెంట్‌గా స్పందించారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఉండే ఫ్లైఓవర్ల కింద ఆటలు ఆడుకునేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముంబయికి చెందిన నెటిజన్‌ ధనుంజయ్‌ ట్వీట్‌ చేశాడు. ఫ్లై ఓవ‌ర్ల కింద ఆట స్థ‌లాలు తీర్చిదిద్దితే ఆట‌లు ఆడుకునేందుకు వెసులుబాటు ఉంటుంద‌ని అతను చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోని కూడా అతను పోస్టు చేశాడు. ఇక ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచ‌న అని, ఈ విధానాన్ని ప‌రిశీలించాలని తెలంగాణ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌కు సూచించారు. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌ జంట న‌గ‌రాల్లో ఈ త‌రహా క్రీడా వేదిక‌ల‌ను అందుబాటులోకి తేవొచ్చ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది అద్భుత‌మైన ఆలోచ‌న‌ అని.. న‌వీ ముంబయిలో ఫ్లై ఓవ‌ర్ల కింద ఆట స్థ‌లాల‌ను నిర్మించిన‌ట్లు అన్ని ప‌ట్ట‌ణాల్లోని ఫ్లై ఓవ‌ర్ల కింద ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఫార్ములా వన్‌ రేస్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇది హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఫ్లై ఓవర్ల కింద హైదరాబాద్‌లో ఆట స్థలాలను తీర్చిదిద్దితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది.