TSPSC: ఇకపై పరీక్షలు ఆన్‌లైన్‌లో

ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదు మూటగట్టుకున్న టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పరీక్ష పత్రాల తయారీ నుంచి పరీక్షలు నిర్వహించే తీరులో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. భవిష్యత్తులో పేపర్‌ లీకేజీ వంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో రాత పరీక్షలు వేగంగా నిర్వహించి ఫలితాలు కూడా అంతే వేగంగా వెల్లడించేందుకు ఆన్‌లైన్‌ విధానం దిశగా అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకు సాధ్యాసాధ్యాలపై బోర్డు ప్రస్తుతం దృష్టి సారించింది.

విడతల వారీగా పరీక్షలు..
ఐబీపీఎస్‌ నిర్వహించే బ్యాంకు పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల మాదిరిగానే టీఎస్పీఎస్ పరిధిలో ఇకపై నిర్వహించే పరీక్షలు అన్నీ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. దీని ద్వారా లీకేజికి అవకాశం ఉండదని వారు భావిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరీక్ష ఏది నిర్వహించినా లక్షల్లో నిరుద్యోగులు పరీక్షలు రాస్తున్నారు. ఈక్రమంలో వారందరికీ కంప్యూటర్‌ టెస్టు నిర్వహించడం అంటే ఒకసారి మన దగ్గర ఉన్న వనరులు, వసతులపై సమీక్ష చేసుకోక తప్పదు. ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష అమలు చేస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్‌ విధానం అమలు చేయాలని భావిస్తోంది. తొలుత ప్రొఫెషనల్‌ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు అమలు చేయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతున్నందున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజుల పాటు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి. తాజాగా ఇంజినీరింగ్‌, ప్రొఫెషనల్‌ కళాశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50 వేల మంది వరకు పెరుగుతుందని అంచనా. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎంవీఐ, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనుంది.

లీకేజీకి చెక్‌ పెట్టొచ్చు..
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా కఠినం, మధ్యస్థం, సులభతరం అనే మూడు కేటగిరీల్లో ప్రశ్నలను తయారు చేసి సర్వర్‌లో అందుబాటులో ఉంచుతారు. ఎంతోముందుగా ప్రశ్నపత్రం ఖరారు చేయడం ఉండదు. పరీక్ష సమయంలో నిర్దేశించిన నిష్పత్తుల్లో అప్పటికప్పుడు ప్రశ్నలు అభ్యర్థులకు కంప్యూటర్‌లో ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఏదీ ఇవ్వరు. కంప్యూటర్‌ స్క్రీన్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీకి దాదాపు చెక్‌ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్వర్‌ సిస్టంను హ్యాక్‌ చేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.

నార్మలైజేషన్‌ మార్కులు ఇలా కేటాయిస్తారు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఎంసెట్‌, ఐఐటీ, మెడికల్‌ తదితర పరీక్షలకు కంప్యూటరైజ్డ్‌ విధానం అమలు అవుతోంది. ఉదయం కొంత మందికి, మధ్యాహ్నం మరికొంత మందికి పరీక్షలు జరుగుతున్నాయి. ఒకపూట నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన ప్రశ్నలు మరోపూట పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రావు. ఉదయం వచ్చిన ప్రశ్నలు… మధ్యాహ్నం రాసేవారికి రావు.. దీంతో ఒకరి కష్టతరంగా మరొకరికి సులువైన ప్రశ్నలు రావచ్చు. దీని నివారించేందుకు ఇద్దరి ప్రశ్నపత్రాలను నార్మలైజ్‌ చేస్తారు. ప్రస్తుతం ఈ విధానం బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అమలు చేస్తున్నారు. ఇక ఇదే విధానాన్ని టీఎస్‌పీఎస్సీ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.