TSPSC గ్రూప్​ 1 పరీక్ష రద్దు..నిరుద్యోగి ఆత్మహత్య!

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన లక్షలాది నిరుద్యోగుల ఆశల్ని చిదిమేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్ధులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాలో నవీన్ అనే అభ్యర్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లుగా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నవీన్.. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్ధితి లేదంటూ జీవితంలో విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఈ మేరకు సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూన్ 11న మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏఈఈ, డీఏవో పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి కాకుండా త్వరలో నిర్వహించాల్సి వున్న మరిన్ని పరీక్షలను వాయిదా వేసే యోచనలో ఉంది కమిషన్​. అయితే 2017 నుంచి ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపి అవకతవకలను గుర్తించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొత్తం టీఎస్‌పీఎస్సీనే రద్దు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.