TSPSC Leak: ఇంటి దొంగల పనే!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ప్రధానంగా ఈ పరీక్ష పేపర్ల లీకేజీ విషయంలో ఇంటి దొంగల పాత్రే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో ఇది భారీ కుట్రే అని స్పష్టం చేస్తుంది. టీఎస్‌పీఎస్సీ ఔట్‌సోర్సింగ్‌, శాశ్వత ఉద్యోగులు సుమారు 25 మంది వరకు గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు సమాచారం. వారిలో 10 మంది క్వాలిఫై అవ్వడమే కాకుండా.. వారికి 100కు పైగా మార్కులు సాధించారని సిట్‌ తేల్చింది. ప్రముఖ కోచింగ్‌ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి.. సంవత్సరాల తరబడి పరీక్షలకు సిద్ధమైనా ప్రిలిమ్స్‌ క్యాలిఫై కావడం సామాన్యులకు గగనంగా ఉంటోంది. మరి అలాంటిది.. ఒకవైపు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగాలు చేస్తూ.. పరీక్షలకు సన్నద్దం కాని వారికి 100కు పైగా మార్కులు రావడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అందులో ప్రవీణ్‌ కూడా ఉన్నారు. ఇతనికి ఏకంగా 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సిట్‌ దర్యాప్తులో ప్రవీణ్‌ సహా 10 మందికి లీకేజీతో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు నిగ్గుతేలింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సురేశ్‌తోపాటు.. రమేశ్‌, వెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రావు, షమీమ్‌.. మరో 5 మంది ఉద్యోగులకు ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు వచ్చాయి.

క్లిష్టంగా వచ్చిన ప్రశ్నాప్రతం.. అయినా అన్ని మార్కులా..
గత ఏడాది టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష పత్రం అత్యంత క్లిష్టంగా.. 75 శాతం అనలటిక్‌, 25 శాతం ఫ్యాక్చువల్‌ ప్రశ్నలతో యూపీఎస్సీని మించి కఠినంగా వచ్చింది. అయినా.. కమిషన్‌ ఉద్యోగులు సుమారు 10 మందికి 100కు పైగా మార్కులు సాధించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 80-90 మార్కులు రావడం గగనం. 3-5 సంవత్సరాలు కష్టపడి చదివితే తప్ప.. ఆ స్థాయిలో మార్కులు రావు. కానీ టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ ఆపరేటర్‌గా పనిచేసే ఓ ఉద్యోగికి 120 ఎలా వచ్చాయి అని అందరూ ఆర్చర్యపోతున్నారని.. అన్నేసి మార్కులు రావడం వెనుక భారీ కుట్ర జరిగిందని.. బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపిస్తున్నారు. పరీక్ష పత్రాల లీక్‌ వ్యవహారంలో చైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి, ఇతర సభ్యులు తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారు. చైర్మన్‌ దగ్గర ఉండాల్సిన పాస్‌వర్డ్‌ సెక్రటరీ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌చార్జి శంకర్‌లక్ష్మి దగ్గరకు ఎలా వెళ్లింది? అనే ప్రశ్నలను విద్యార్థి సంఘాలు లేవనెత్తుతున్నాయి. ‘‘ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ జిరాక్స్‌ సెంటర్‌ అంటూ పోస్టర్లు..
టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ అంశంపై ఓయూ జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఆ కార్యాలయం వద్ద వెలిసిన పోస్టర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఓయూ జేఏసీ చైర్మన్‌ అర్జున్‌బాబు పేరుతో ‘టీఎస్‌పీఎస్సీ ఓ జిరాక్స్‌ సెంటర్‌’ అంటూ బుధవారం ఉదయం పోస్టర్లు వెలిశాయి. ‘ఇక్కడ అన్ని రకముల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ ప్రశ్నపత్రాలు లభిస్తాయి’ అంటూ ట్యాగ్‌లైన్‌ కూడా పెట్టారు. ఇది ఇలా ఉంటే.. ఈ కేసులో ప్రధాన నిందితులు రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌ పలు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కైనట్లు కూడా సిట్‌ ప్రాథమికంగా ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. అయితే.. ఏయే కోచింగ్‌ సెంటర్లకు వీరు ప్రశ్నపత్రాలను లీక్‌ చేశారు? అనే దానిపై ఇంకా వివరాలు అందాల్సి ఉందని సమాచారం. ఆయా కోచింగ్‌ సెంటర్ల నుంచి ఎంత మంది క్వాలిఫై అయ్యారు అన్న విషయాలు కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.