Eamcet: ఇంటర్ మార్కుల వెయిటేజ్ రద్దు.. కారణం ఇదే!
Hyderabad: కరోనా కారణంగా గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష(ts eamcet exam)కు ఇంటర్ మార్కుల(inter marks) వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఇక ఈ ఏడాదితోటు.. రానున్న రోజుల్లో కూడా ఎంసెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ (inter marks weightage) ఇవ్వమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. గతంలో ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీని ఇచ్చేవారు. ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు 600 మార్కులకు గాను 25 శాతం వెయిటేజీ తీసుకుని గతంలో ఎంసెట్ ర్యాంకును కేటాయించేవారు. తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల మేరకు.. ఇంటర్ మార్కులను ఎంసెట్ ర్యాంకుల విషయంలో పరిగణనలోకి తీసుకోమని.. కేవలం ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణలో నిర్వహించే ఎంసెట్ పరీక్షను వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాస్తుంటారు. దీంతో ఆయా బోర్డులు ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం అవుతోంది. దీంతో ఎంసెట్ రిజల్ట్స్ ప్రకటించేందుకు తెలంగాణ విద్యాశాఖకు ఇబ్బందిగా మారుతోంది. ఇదే సమస్య వల్ల జేఈఈ మెయిన్, నీట్‌లలోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీని కేంద్రం ఎత్తివేసింది. అనేక రాష్ట్రాల్లో కూడా ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారులు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ ఇవ్వకూడదని నిర్ణయించుకుని తాజాగా జీవోని విడుదల చేశారు.