Telangana tourism: పర్యాటకులకు ఏసీ క్యారవ్యాన్‌లు!
hyderabad: సమ్మర్ హాలిడేస్‌లో అందరూ వెకేషన్లకు వెళ్తుంటారు. అయితే.. కొందరు సొంత కార్లలో వెళ్తుంటారు. మరి కొందరు ప్రైవేటు వెహికల్స్, బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. వాస్తవానికి వీరందరూ ఆహ్లాదకరమైన జర్నీని మిస్సవుతుంటారు. మార్గం మధ్యలో ఉండే ప్రకృతి అందాలను అనుభవించే అవకాశం పూర్తిగా ఉండదు. అదేవిధంగా నచ్చిన ఫుడ్‌ని వండుకుని ఇష్టంగా తినలేరు. దీంతో వారి ప్రయాణం స్పాట్ అల్పసంతోషాన్నే ఇస్తుంది. మనం వెళ్లే పర్యాటక ప్రాంతంతోపాటు, మార్గం మధ్యలో ఉండే ప్రకృతిని ఆస్వాధిస్తూ.. నచ్చిన చోట ఆగుతూ.. ఇష్టమైన ఫుడ్‌ని స్వయంగా వండుకుని తింటూ ప్రయాణిస్తుంటే.. ఆ కిక్కే వేరప్పా. మరి అలాంటి కిక్కుని ఇచ్చే విధంగా తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) సిద్దమైంది. సకల సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ క్యారెవ్యాన్‌ను అద్దెకు ఇస్తోంది. ఇక ఇందులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి.. ప్యాకేజీ వివరాలు తెలుసుకుందామా?
హైదరాబాద్ నగర శివారుల్లో, తెలంగాణ వ్యాప్తంగా అందమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడికి పర్యాటకులు అధికంగా వెళ్తుంటారు. అలాంటి వారందరికీ క్యారవ్యాన్ వాహనం అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం అని చెప్పవచ్చు. ఈ క్యారవ్యాన్‌లో ఏసీ సదుపాయంతోపాటు.. టాయిలెట్, షవర్, రెండు LED స్క్రీన్‌లు, రిఫ్రిజిరేటర్‌తో కూడిన కిచెన్ ఉంటాయి. వ్యాన్‌లోని సీట్లు కూడా.. సోఫాలుగా లేదా.. బెడ్‌లుగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది. ఇందులో కనీసం ఏడుగురు ప్రయాణించవచ్చని అంటున్నారు. ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. 8 గంటలు లేదా.. 80 కిమీ ప్రయాణానికి రూ. 4000 తీసుకుంటున్నారు. 12 గంటలు – 200 కిమీ – రూ. 6000, అంతకు మించి దూరం వెళితే.. కిలోమీటరుకు రూ. 35 చెల్లించాలి అలా.. కనీసం 300 కి.మీ వరకు దూరం వెళ్లవచ్చు. అయితే.. వాహనం తీసుకునే ముందు.. టూర్ ప్యాకేజీపై 20 శాతం కాషన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా టోల్ గేట్లు, పార్కింగ్ ఛార్జీలు వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది.