రాజాసింగ్‌కు పాకిస్తాన్‌ నుంచి బెదిరింపు కాల్స్‌

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ రాశారు. పలు ఫోన్‌ నంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని.. ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా రాష్ట్ర డీజీపీకి రాజాసింగ్‌ ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని అందులో ఆరోపించారు. రాతపూర్వకంగా డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేను చంపుతామని బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పాలన్నారు.

పాకిస్థాన్‌ నుంచి బెదిరింపు కాల్స్‌..
ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు పాకిస్తాన్‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు . వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ… హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్‌ స్లీపర్‌ సెల్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు. ప్లస్‌ 923105017464 నంబర్‌ నుంచే బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కనీసం హైదరాబాద్ పోలీసులు స్పందించడం లేదు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ‘నేను జై శ్రీరామ్ అని ఒక్క ట్వీట్ చేసినా, హిందువులకు మద్దతుగా నా గొంతు విప్పినా’… తనపై కేసులు పెట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారని.. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు స్పందించడం లేదన్నారు.

నిత్యం వివాదాల్లో రాజాసింగ్‌..
నిత్యం వివాదాల్లో ఉండే రాజాసింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి పాకిస్తాన్‌ నుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే గతంలో సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఓ వీడియోను రాజాసింగ్ అప్‌లోడ్ చేయగా.. దీనిపై ఎంఐఎంతోపాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. వారు పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేశారు. దీంతో గతేడాది ఆగస్టు 23న రాజాసింగ్‌ అరెస్టయ్యారు. అనంతరం గత ఏడాది నవంబరులో రాజాసింగ్ విడుదలయ్యారు. ఈక్రమంలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్న ఆయన.. శ్రీరాముడు, గోమాత ఆశీర్వాదం వల్లే తాను క్షేమంగా బయటకు వచ్చినట్లు తెలిపారు.