అందుకే ఆ బ్లూ ఫిలిం చూశా: త్రిపుర ఎమ్మెల్యే
త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా… అక్కడ బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో తన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై గురువారం పెద్దఎత్తున జాతీయ మీడియాలో, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి బీజేపీ పార్టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు పక్కాగా.. ఆధారాలు ఉండటంతో అతని నుంచి వెంటనే స్పందన రాలేదు. సాయంత్రానికి తేరుకున్న ఎమ్మెల్యే జాదవ్.. ఈ ఇష్యూపై స్పందించారు.
ఎమ్మెల్యే ఏమన్నారంటే..
అసెంబ్లీ సాక్షిగా పోర్న్ వీడియో చూశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ ఎట్టకేలకు స్పందించారు. అసెంబ్లీలో ఉండగా.. తనకు ఓ కాల్ వచ్చిందని దాన్ని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించానని.. ఈక్రమంలో ఓ వీడియో ఓపెన్ అయ్యిందని.. దాన్ని తీసివేద్దామని చూసినప్పటికి వెంటనే సాధ్యపడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ వీడియోలను చూడలేదని అన్నారు. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి తీర్పు వెలువడినా.. దాన్ని స్వీకరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా.. శాసన సభలో సభాపతి, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన మొబైల్ ఫోన్‌లో వివిధ వీడియోలను ఆసక్తిగా చూసినట్లు తెలుస్తోంది. ఆయన ఉద్దేశపూర్వకంగా ఓ వీడియోను మరింత ఆసక్తిగా చూసినట్లు, అది పోర్నోగ్రాఫిక్ వీడియో అని తెలుస్తోంది. ఆయన వీటిని చూసే సమయంలో ఆయన వెనుక కూర్చున్నవారు ఎవరో చిత్రీకరించారని స్పష్టం అవుతోంది. దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది.
తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్..
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ వీడియోపై స్పందిస్తూ, బీజేపీని బ్లూజేపీ అని, ఇది సిగ్గు చేటు అంటూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బీజేపీ నేతలు పోర్న్ చిత్రాలను చూస్తూ పట్టుబడటం ఇదేం తొలిసారి కాదు. కర్ణాటక శాసన సభలో 2012లో బీజేపీ మంత్రులు లక్ష్మణ్ సావడి, సీసీ పాటిల్ తమ ఫోన్లలో పోర్న్ చూస్తూ పట్టుబడ్డారు. అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే వారు తప్పు చేయలేదని దర్యాప్తులో నిర్దారణ అయిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చేరారు. మరి ఇప్పుడు బీజేపీ అధిస్టానం త్రిపుర ఎమ్మెల్యే జాదవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.