ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌ భేటీ.. కారణం ఇదే!

ఏపీలో ఎండల తీవ్రత ఏవిధంగా ఉందో రాజకీయాలు కూడా అంతే హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార పార్టీ ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికల్లో మూడు చోట్లా ఓడిపోవడం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక సీటు చేజార్చుకోవడం.. ఇక ప్రధానంగా సీఎం జగన్‌ ఇటీవల ఢిల్లీకి రోజుల వ్యవధిలోనే వరుసగా రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిరావడంపై రాష్ట్రంలో అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. కొందరు తెలంగాణతోపాటు ఏపీలో కూడా డిసెంబర్‌ నాటికి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టాక్‌ నడుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ.. ప్రజల్లో ఆ పార్టీపై ఏ మేరకు విశ్వాసం ఉంది. జగన్‌ నియమించిని ఐప్యాక్‌ టీం ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టు ఏవిధంగా ఇచ్చారు? మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న విషయాలన్నీ ఏప్రిల్‌ 3వ తేదీ సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో బహిర్గతం కానున్నాయి. దీంతో ఈ సమావేశంపై అందరి దృష్టి ఏర్పడింది. తాజా పరిస్ధితిపై సమీక్షించి తిరిగి పార్టీని గాడిన పెట్టేందుకు సీఎం జగన్ మరో సమీక్షకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3న మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహణపై సమీక్ష ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేల సీట్లను సీఎం కన్ఫామ్‌ చేస్తారా?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే.. సమయం కూడా పెద్దగా లేకపోవడంతో ఈ సారి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏఏ నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతారో సీఎం జగన్‌ ఈ సమావేశంలో స్పష్టం చేసిన ఆశ్చర్యం లేదని పలువురు అంటున్నారు. దీంతోపాటు ముఖ్యంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు తెలంగాణతోపాటు డిసెంబర్‌ లోనే ఏపీలో ఎన్నికలు ఉంటాయంటే.. వాటి సన్నద్దతపై మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఇక నిత్యం ప్రజల మధ్యే ఉండి.. రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని సీఎం జగన్‌ సూచించే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి కార్యక్రమాలు ఇలా..
సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్లను మార్చి నుంచే సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్దిదారుల ఇళ్లకు అంటించాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో అది కాస్త ఆలస్యం అయ్యింది. ఈక్రమంలో ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి ‘జగనన్న నువ్వే మా భవిష్యత్తు’ అన్న స్టిక్కర్లను వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సమన్వయకర్తలు ఇంటింటికీ వెళ్లి అంటించనున్నారు. ఇంటితోపాటు, సెల్‌ఫోన్‌ పౌచ్‌లకు కూడా స్టిక్కర్లను వీలైతే అంటించాలని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది బలవంతం ఏమీ లేదని.. ఎవరి ఇష్టం వారిదని.. ఇబ్బంది లేకుంటేనే స్టిక్కర్లను అంటించుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఈ కార్యక్రమంపై కూడా సీఎం జగన్‌… ఎమ్మెల్యేలతో ఏప్రిల్‌ మూడో తేదీన చర్చించే అవకాశం ఉంది.