పొత్తులపై జనసేన పార్టీ క్లారిటీ
జనసేన ఆవిర్బావ సభ ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకునే అంశంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు కొందరు కావాలని పెడుతున్నారని.. జనసేనాని పవన్ కల్యాణ్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అంతర్గతంగా సూచించినట్లు సమాచారం. జనసేన-టీడీపీ పొత్తుల అంశంపై సాగుతున్న ఫేక్ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు ఆ మేరకు సమాచారం పంపారు.
పవన్ ప్రకటనలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు, యువత భవితను దృష్టిలో ఉంచుకుని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పినప్పటి నుంచి.. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని జనసేన పేర్కొంది. జనసేనతోపాటు ఇతర ప్రతిపక్ష నాయకుల పేర్లతో తప్పుడు ప్రకటనలతో గందరగోళం సృష్టించడం ఆ క్రీడలో భాగమే అని తెలిపింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రకటనలు, సమాచారంతో గందరగోళానికి గురికావొద్దు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పవన్ కల్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోబోయే నిర్ణయాలను, అనుసరించే వ్యూహాలను పారదర్శకంగా పార్టీ నాయకులకు తెలియజేస్తారు. అందువల్ల… పొత్తులు, వ్యూహాలపై అనవసరమైన ఆందోళనలకు గురికావొద్దు’’ అని జనసేన తన పార్టీ శ్రేణులకు సూచించింది.
ఆవిర్భావ సభలో పవన్ ఏమన్నారంటే..
రాష్ట్రానికి ఏం జరిగితే బాగుంటుందని మీరు ఏం కోరుకుంటున్నారో అది నాకు తెలుసు. అదే జరుగుతుంది. వైసీసీ వ్యతిరేక ఓటు వృథా కానివ్వను. రాష్ట్రం హితం కోసమే నిర్ణయం తీసుకుంటా. నన్ను నమ్మండి’’ అని ఆవిర్భావ సభలో పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కొన్ని సామాజిక మాధ్యమాల్లో అచ్చెన్నాయుడు జనసేనతో పొత్తు ఉండదని అవసరమైతే 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఇలాంటి పోస్టులు ఇటీవల వైరల్ అయ్యాయి. మరోవైపు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేరుతో కూడా కొన్ని పోస్టులు అనధికారికంగా ఎవరో గ్రూపుల్లో పోస్టులు చేశారు. కాగా.. ఇవన్నీ వైసీపీ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రలని.. వీటిని నమ్మి వారి ట్రాప్‌లో జనసేన కార్యకర్తలు, అభిమానులు పడవద్దని ఆ పార్టీ సూచిస్తోంది. రాజకీయ క్రీడలో భాగంగా వైసీపీ మైండ్‌గేమ్ సాగిస్తోందని, ప్రతిపక్ష నేతల పేరుతో తప్పుడు ప్రకటలు సృష్టిస్తూ గందరగోళం రేపుతోందని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు, వ్యూహాలు, సీట్లు వంటి అంశాలను అధినేత చూసుకుంటారని, తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని, పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు గందరగోళానికి, భావోద్వేగాలకు లోనుకావద్దని జనసేన, టీడీపీ పార్టీలు ఆ పార్టీ క్యాడర్‌కు చెబుతున్నాయి.