వైకల్యం ఉందని కన్న బిడ్డను వదిలేశారు.. ఎంతటి అమానవీయమో!
కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు.. అంటే పిల్లలు ఏ విధంగా ఉన్న తల్లిదండ్రులకు ముద్దుగానే ఉంటుంది అని నానుడి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటుచేసుకున్న ఘటనను పరిశీలిస్తే మాత్రం ఈ కసాయి తల్లిదండ్రులు ఎవరు అన్న సందేహం తప్పకుండా వస్తుంది. సాధారణంగా కడుపున పుట్టిన పిల్లలు ఎలా ఉన్నా.. వారిని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు తల్లిదండ్రులు. అంగవైకల్యం ఉందనో.. మానసిక స్థితి సరిగా లేదనో.. భారంగా భావించి పేగు బంధాన్ని వదులుకోకుండా.. తమకు శక్తి ఉన్నంతవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటుంటారు. కానీ అలాంటిది అక్కడ జరగలేదు. నవమాసాలు కని పెంచిన తల్లి.. అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రి… అంగవైకల్యంతో జన్మించిందని తన కూతురుని వదిలించుకోవాలని భావించారు. మానసిక పరిస్థితి బాగాలేక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగ బాలికను వేములవాడలోని రాజన్న ఆలయంలో వదిలి వెళ్లిపోయారు.
తల్లిదండ్రులను గుర్తించే పనిలో అధికారులు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సుమారు 15 ఏళ్ల దివ్యాంగ బాలికను వదిలి వెళ్లారు. ఆ అమ్మాయిని గమనించిన కొందరు భక్తులు.. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ అధికారులకు సమాచారం అందించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వర్ణలత రాజన్న ఆలయానికి చేరుకున్నారు. మానసిక పరిస్థితి బాగాలేక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలికను వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బాలికకు మాటలు రాకపోవడం, నడవలేని పరిస్థితిలో ఉండటంతో ఆశ్రయం కల్పించేందుకు అధికారులకు కాస్త ఇబ్బందులు పడ్డారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేయించారు. బాలికకు సంబంధించిన బంధువుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎలాంటి సమాచారం దొరకలేదని జిల్లా బాలికల పరిరక్షణ అధికారి స్వర్ణలత తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సదరు బాలికకు మెరుగైన వసతి కల్పించి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె తెలిపారు.