‘కామన్​సెన్స్​ లేని వాళ్లు మాట్లాడే మాటలవి’.. హరీష్​ శంకర్​ కామెంట్స్​ ఆ దర్శకుడి గురించేనా?

ఇటీవల ‘కంచర పాలెం’ ఫేమ్​ డైరెక్టర్​ వెంకటేష్​ మహా ఓ ఇంటర్వ్యూలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా కన్నడ సూపర్​ హిట్​ మూవీ KGF గురించి, అందులో హీరో క్యారెక్టరైజేషన్​ గురించీ చాలా దారుణంగా కామెంట్స్​ చేశారు. దాంతో వెంకటేష్​ మహా సినీ అభిమానుల ఆగ్రహానికి బలై ట్రోల్స్​ బారినపడ్డారు. కానీ ఆయ‌న త‌గ్గేదే లే.. సారీ చెప్పేదే లే అని కుంబ బ‌ద్ద‌లు కొట్టేశాడు. దీనిపై పెద్ద వాద‌న‌లే జ‌రిగాయి. అయితే తాజాగా ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు హరీష్​ శంకర్​ మాట్లాడారు. దీంతో మరోసారి ఈ వివాదం తెరమీదకు వచ్చింది.
దిల్​రాజు నిర్మాతగా, వేణు ఎల్దండి దర్శకత్వంలో చిన్న సినిమాగా విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న ‘బలగం’ సినిమా సక్సెస్​ మీట్​లో హరీష్​ మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్​ మాట్లాడుతూ..‘పెద్ద సినిమా తీయాలంటే బాగా డ‌బ్బులుండాలేమో కానీ బ‌లగం వంటి మంచి సినిమాను తీయాలంటే పెద్ద మ‌న‌సుండాలి. క్లాస్, మాస్, కమర్షియల్ సినిమాలనేవి మన ఇండస్ట్రీలోని వాళ్లు పెట్టుకున్న పేర్లు. కానీ బయట ప్రేక్ష‌కుకులు వీటిని ప‌ట్టించుకోరు. వాళ్ల‌కి కావాల్సింది మంచి సినిమా. పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను చూసిన అదే మాస్ ప్రేక్ష‌కులు సాగ‌ర సంగ‌మం, స్వాతిముత్యం వంటి సినిమాల‌ను ఎడ్ల‌బండ్లు క‌ట్టుకుని వెళ్లి మరీ చూశారు. సినిమా ఇండ‌స్ట్రీ బ‌య‌ట మ‌నం ఫేస్ చేసే స‌మ‌స్య‌లు చాలానే ఉన్నాయి. వాట‌న్నంటిని వ‌దిలేసి మ‌నం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాం. సైకిల్‌పై వెళ్లేవాడు బ‌య‌ట గాలిని ఎంజాయ్ చేస్తుంటాడు. కారులో వెళ్లేవాడు ఏసీ గాలిని ఎంజాయ్ చేస్తుంటాడు. అలాగ‌ని సైకిల్‌లో వెళ్లేవాడు కారులో వాడిని తిట్ట‌న‌క్క‌ర్లేదు. కారులో వెళ్లేవాడు సైకిల్‌పై వెళ్లేవాడిని చిన్న చూపు చూడ‌న‌క్క‌ర్లేదు. మ‌న ఆరోగ్యానికి పెరుగన్నం మంచిదే. కానీ బ‌య‌ట ఎక్కువ‌గా బిర్యానీ సేల్ అవుతుంది. ఎందుకు నా పెరుగన్నాన్ని ఎవ‌రూ కొన‌లేద‌ని అనుకోకూడ‌దు. బిర్యానీ తినండి.. త‌ర్వాత మా పెరుగ‌న్నం కూడా తినండి అనాలి. మ‌నం బిర్యానీ, పెరుగ‌న్నం రెండింటినీ అందించాలి. నా ముందువాడి సినిమా హిట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే బ‌య్య‌ర్స్ ద‌గ్గ‌ర డ‌బ్బులుంటాయి. నా సినిమాను ఎక్కువ రేట్ పెట్టి కొంటాడ‌ని సంతోష‌ప‌డ‌తాను. కానీ బ‌య‌ట ఎవ‌రో మ‌న ముందోడి సినిమా పోయింద‌ని మ‌నం క్లాప్స్ కొడుతున్నట్లు రాస్తుంటారు. అది కామ‌న్ సెన్స్ లేని వాళ్లు చేసే ప‌ని’ అంటూ తనదైన స్టైల్లో చిన్నపాటి క్లాస్​ పీకారు హరీష్ శంకర్.
అయితే హరీష్​ మాట్లాడింది కచ్చితంగా వెంకటేష్​ మహా చేసిన వ్యాఖ్యల గురించే అంటూ సోషల్​ మీడియాలో చర్చ మొదలైంది. పేరు ప్రస్తావించకుండా గట్టిగా సమాధానం చెప్పారంటూ పలువురు నెటిజన్లు హరీష్​ని మెచ్చుకుంటున్నారు. ఇక, హరీష్​ శంకర్​ దర్శకత్వంలో రూపొందనున్న ఉస్తాద్​ భగత్​సింగ్​ త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ప్రేక్షకులను అలరించనున్నారు.