అమిత్ షాతో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇవే!
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన అమిత్ షాతో రాత్రి 10-45 గంటలకు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని… అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాల పరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లిందని… ఈ నష్టాల నుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వగా వాటిని ఇప్పటికీ అమలు చేయలేదని వీటిపై వెంటనే దృష్టిసారించమని అమిత్ షాను జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్ దెబ్బతిందని.. డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసినట్లు అమిత్ షాకు జగన్ వివరించారు. ఈ డబ్బును వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రూ.2,600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని.. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించేలా చూడాలని అమిత్ షాను సీఎం జగన్ కోరారు. దీంతోపాటు ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఎంతో అవసరమని సీఎం గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఆరోజు ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదా ఇస్తే.. అనేక రాయితీలు, ఆర్థిక వనరులు రాష్ట్రానికి ఒనగూరుతాయని సీఎం జగన్ అమిత్ షా కు వివరించారు. ప్రధానంగా పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక వీటిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇక ఇవాళ కూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండి.. కొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులను వారికి కూడా వివరిస్తారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.