తెలంగాణ పది పరీక్ష పత్రాల్లో కొత్త మార్పులు ఇవే!
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ్లి నుంచే హాల్ టికెట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టెన్త్ బోర్డు పేర్కొంది. హాల్ టికెట్టుపై హెచ్‌ఎం సంతకం లేకపోయినా పరీక్ష రాయవచ్చని తెలిపింది. స్కూల్ ఎడ్యూకేషన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని చెప్పింది. స్టూడెంట్స్ నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది విద్యాశాఖ. వచ్చే నెల 3వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,652 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు.
పరీక్ష పత్రాల్లో ఈ ఏడాది కొత్త మార్పులు ఇవే..
ఈ ఏడాది నిర్వహించనున్న పదో పరీక్ష పత్రాల్లో ప్రశ్నలను కొంత మార్పు చేశారు. పేపర్స్‌లోని వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానం రాస్తే చాలని చెబుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ జనవరి 11నే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 28న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప ప్రశ్నల విభాగంలో ఇంతకుముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది. అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బీ అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనిపై ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో టెన్త్ బోర్తు కొంత వెసులుబాటు కల్పించారు. మరోవైపు కోవిడ్ కారణంగా పిల్లల్లో లెర్నింగ్ కేపబులిటీస్ కూడా తగ్గాయని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఎగ్జామ్ ప్యాట్రన్‌లో మార్పులు చేయాలని..ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను రిమూవ్ చేసింది. దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల అలాట్‌మెంట్ మారింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లకు…అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతోపాటు 2023-24 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తించనున్నట్లు పేర్కొన్నారు.
పరీక్షలు నిర్వహించే సమయాలు ఇవే..
ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈక్రమంలో వేసవి రీత్యా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, కేంద్రాల వద్ద మంచినీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.