రేపు కవితనూ అరెస్ట్‌ చేయొచ్చు – కేసీఆర్‌ సంచలన కామెంట్స్‌

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఎప్పటి నుంచో చెబుతున్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్‌ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత సమావేశం జరగగా.. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు ముచ్చటే లేదన్నారు. దాని ప్రకారం నియోజకవర్గాల వారీగా నాయకులు సమావేశాలు నిర్వహించుకోవాలని.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏప్రిల్-27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. నేతలంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజా సమస్యలను పరిష్కారించాలని కేసీఆర్ కీలక సూచనలు చేశారు. ఇక నుంచి నేతలంతా ప్రజల్లోనే ఉండాలని.. అవసరమైతే పాదయాత్రలు కూడా చేసుకోవాలని ఆయన ఓ సలహా ఇచ్చారు.

కవిత అరెస్టుపై కేసీఆర్‌ ఏమన్నారంటే..
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు ఈడీ నోటీసులపై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని కేసీఆర్‌ అన్నారు.. రేపు విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు. చేసుకుంటే చేసుకోనీ అందర్నీ వేధిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు. న్యాయపోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరని వారిని కేసులతో వేధిస్తున్నారు. కవితను కూడా చేరమన్నారు. ​​​మహా అయితే ఏం చేస్తారు.. జైలుకు పంపుతారు అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.