తెలంగాణలో కలకలం రేపుతున్న ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు!

సాధారణంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని గతంలో ఆత్మహత్యలు అధికంగా చేసుకునేవారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆత్మహత్య ఘటనలను పరిశీలిస్తే మాత్రం.. నివ్వెరపోవాల్సిందే.. పరీక్షలు సరిగా రాయకపోయామనే మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. బతికేందుకు కేవలం చదువు ఒక్కడే మార్గం కాదని.. ఎన్నో పనులు చేసుకుని సంతోషంగా జీవించవచ్చని… డబ్బులు, గౌరవాన్ని సంపాదించవచ్చని సైకాలజిస్టులు చెబుతున్నారు.

వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని నాగజ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ జూనియర్ కళాశాలకు చెందిన ఆమె.. ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన పరీక్ష సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతోపాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.

బెల్లంపల్లిలో మరొకరు..

బెల్లంపల్లి పట్టణంలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థి కాపెల్లి శివకృష్ణ ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష బాగా రాయలేదని మనస్థాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన కాపెల్లి శివకృష్ణ (18) ఓ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రానికి శివకృష్ణ రాగా.. అక్కడ అతన్ని వదిలేసి తల్లిదండ్రులు మంచీర్యాల వెళ్లిపోయారు. ఇవాళ సంస్కృతం పరీక్ష రాసి వచ్చిన శివకృష్ణ… తల్లి శారదకు ఫోన్ చేసి పరీక్ష సమయంలో కడుపునొప్పి వచ్చిందని… అందుకే పరీక్ష బాగా రాయలేకపోయానని, బాధపడుతూ ఆమెతో మాట్లాడాడు. దీంతో తల్లి శారద ఏం కాదులే బాధపడకు అని సర్ది చెప్పింది. ఆ తర్వాత కొంత సమయానికే శివకృష్ణ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తల్లిదండ్రులను కన్నీటిపర్యంతం చేసింది.

మరో అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి..
పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని, బాగా రాయలేదనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. బతకడానికి చదువు ఒక్కడే మార్గం కాదని.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుందని.. దాన్ని గుర్తించి ఎన్నో పనులు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. జీవితం చాలా విలువైనదని తల్లిదండ్రులకు క్షోభకు గురిచేసే పనులు విద్యార్థులు చేయవద్దని నిపుణులు కోరుతున్నారు. ఒకసారి ఫెయిలైతే కోల్పోయేది ఏమీ ఉండదని.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతున్నారు.