పవన్‌ ఇప్పటం సీన్‌ రిపీట్‌ చేస్తారా? సభకు ర్యాలీగా వెళ్లొద్దంటున్న పోలీసులు!

జనసేన పార్టీకి పోలీసులు మరోసారి ఝలక్‌ ఇచ్చారు. రేపు మచిలీపట్నంలో నిర్వహించే సభకు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ర్యాలీగా వెళ్లవద్దంటూ జనసేన పార్టీ శ్రేణులకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అయితే.. గతంలో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలు జరగగా.. ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ అక్కడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ పవన్‌ కొంతదూరం వరకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు పవన్‌ను కారులో వెళ్లాలని చెప్పడంతో.. ఆయన ఏకంగా కారు పైటాప్‌ ఎక్కి కూర్చుని.. సినిమా తరహారాలో ఇప్పటం గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామస్థులను పరామర్శించారు. ఈసారి కూడా మచిలీపట్నం సభకు ర్యాలీ వెళ్లేందుకు పోలీసులు అనుమతులు ఇవ్వనితరుణంలో ఇప్పటం సీన్‌ రిపీట్‌ అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాంతంలో సుమారు 34 ఎకరాల విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మంగళవారం నాడు అంటే సభ జరిగే రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన వారాహ వాహనంలో ఆ పార్టీ శ్రేణుల నడుమ విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తారని ముందుగానే ప్రకటించారు. అయితే.. మచిలీపట్నం బైపాస్‌పై ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతులు లేవని ప్రస్తుతం పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. జాతీయ రహదారిపై ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్న దృష్ట్యా ఎలాంటి ర్యాలీలు చేయవద్దని కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువా సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం చర్యలు గట్టిగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.

నిబంధనలతో ముందునుంచే ఉక్కుపాదం..
ర్యాలీకి అనుమతి లేదని.. సభ జరిగే కొన్ని గంటల ముందు పోలీసులు ప్రకటించడంపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయా కార్యక్రమాలకు సంబంధించి అనుమతులు తీసుకున్నామని ఈ క్రమంలో ర్యాలీలకు అనుమతులు లేవని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో సభకు ప్రజలు తరలి రాకుండా కట్టడి చేయాలని చూస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైజాగ్‌ పర్యటన సమయంలో కూడా పోలీసులు అత్యుత్సాహం చూపారని.. పవన్‌కు వస్తున్న ఆధరణ చూసి వైసీపీ తట్టుకోలేక ఈ చేష్టలకు పాల్పడుతోందని నాయకులు అంటున్నారు.

ఎస్పీ ఏమన్నారంటే..

ఈ నెల 14న అంటే మంగళవారం నాడు మచిలీపట్నం పరిధిలోని సుల్తానగర్ వద్ద జనసేన పదో ఆవిర్భావ సభ జరగనుంది. ఈక్రమంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే జాతీయ రహదారి నంబరు 65పై ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదని కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్టు 30 అమల్లో ఉన్నందున అనుమతులు లేవన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణాలు సాగించే సామాన్య ప్రజానీకానికి, అత్యవసర సర్వీసులైన మెడికల్, ఫైర్, ఇతర వాహనాలకు ఎటువంటి అంతరాయం కలిగించకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. పోలీసు వారి అనుమతులకు విరుద్ధంగా ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు గాని నిర్వహిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఎస్పీ స్పష్టం చేశారు.