రేపట్నుంచే రంజాన్ మాసం ప్రారంభం
ముస్లింలకు అతి పెద్ద పండుగ రంజాన్.. నెల రోజులపాటు ఉపవాస ప్రార్థనల్లో ఎంతో నిష్టగా ముస్లింలు పాల్గొంటారు. ఇక బుధవారం భారత్‌లో నెలవంక కనిపించడంతో శుక్రవారం నుంచి మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఇక శుక్రవారం నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
రంజాన్ సందేశం ఇదే..
ముస్లింల పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది రంజాన్ మాసంలోనే … రంజాన్ పండుగకు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ‘పండుగ’ అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే….. దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది’ పండుగ ‘ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ” రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చాంద్రమాన కేలండర్‌ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అని ముస్లింలు పేర్కొంటారు. రంజాన్ సందర్భంగా ధార్మిక చింతనతోపాటు, ధానధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వడమే పండుగ సందేశంగా ముస్లింలు భావిస్తుంటారు.
పలు దేశాల్లో గురువారం నుంచే..
భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్ మార్గ్‌లో జరిగిన రుయత్ ఏ హిలాల్, ఇమారత్ ఏ షరియా-హింద్ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్ ఉలేమా ఏ హింద్ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేసియాలో నెలవంక కనిపించినట్లు ప్రకటించగానే బుధవారం సాయంత్రం ప్రార్థనలు మొదలయ్యాయి. సౌదీ అరేబియాతోపాటు పలు మధ్య ప్రాచ్య దేశాల్లోనూ బుధవారం రాత్రితో రంజాన్ నెల మొదలైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ దేశాల్లో గురువారం నుంచి ఉపవాసాలు ఉంటారు. చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. నెలవంక కనిపించగానే ఏటా రంజాన్ నెల ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఇది కొన్ని దేశాల్లో ఒకరోజు వెనుకాముందుగా ఉంటుంది.