The Kashmir Files: సీఎంకు డైరెక్టర్​ నోటీసులు!

West Bengal: వివాదాల నడుమ ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా రిలీజ్​తో మరోసారి ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) సినిమా వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమా విడుదల సమయంలోనూ రకరకాల వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాపై మమతా బెనర్జీ(Mamata banerjee) చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(vivek agnihotri) ఆగ్రహం వ్యక్తం చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని మమతా ఇటీవలె విమర్శించారు. అంతేకాకుండా ది కేరళ స్టోరీ సినిమా కథను వక్రీకరించి..బీజేపీ(BJP) మార్గదర్శకాలతో రూపొందించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మమతకు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి లీగల్ నోటీసులు పంపారు. కాశ్మీర్ ఫైల్స్ మూవీపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా తాను తీయబోయే సినిమా కూడా బెంగాల్ హింసాకాండపై అని ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తన సినిమాకు మమత నిధులు సమకూర్చారనేది కూడా అసత్యమే అని వెల్లడించారు.
2022లో విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ మూవీ దేశంలో సంచలనం సృష్టించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ 1980-90లలో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన హత్యాకాండ ఇతివృత్తాంతో తెరకెక్కింది. అయితే ఒక వర్గాన్ని కించపరుస్తూ మూవీ తీశారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. మరోవైపు కేరళ స్టోరీ.. కేరళలో అమ్మాయిల మిస్సింగ్ పై తెరకెక్కింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మూవీకి పన్ను మినహాయింపును ఇస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాను నిషేధిస్తున్నాయి.