rain alert: దూసుకొస్తున్న ‘మోచా’ తుపాను..!

hyderabad:: దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తోన్న తరుణంలో.. వరుణుడు.. అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గత రెండు మూడు రోజులగా తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రైతులు(farmers loss crop) కుదేలయ్యారు. ఇక తాజాగా.. బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (imd) వెల్లడించింది. మే 6వ తేదీన బంగాళాఖాతంలో తుపాను(cyclone mocha) ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది. మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈ తుపాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు.

తుపాను ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు. గత మే నెలలో అసాని తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. ఇక రానున్న 48 గంటల్లో ఏపీలో వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఏపీలోని పల్నాడు జిల్లాల్లో భారీ వర్షానికి కళ్లాల్లో ఉన్న వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి, కోసి ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసిపోయాయి. తెలంగాణలోనూ అనేక జిల్లాలో పంట నష్టపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.