ఇప్పటంలో హై టెన్షన్.. మళ్లీ కూల్చివేతలు మొదలు!
గత ఏడాది జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చిన ఇప్పటం గ్రామంలో మరోసారి కూల్చివేతల పర్వం మొదలైంది. ఈ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సుమారు రెండు బస్సుల్లో పోలీసులను గ్రామంలో మోహరించారు. ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించిన వారి గోడలను రెండు జేసీబీలతో అధికారులు కూల్చివేతను చేపట్టారు. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకునేందుకు గ్రామస్థులు నిరసన వ్యక్తం చేసి ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామ సరిహద్దుల్లో పోలీసుల పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
ఆటో, బస్సు సౌకర్యం లేని గ్రామంలో 70 అడుగుల రోడ్డా..
ఇప్పటం గ్రామానికి ఇప్పటి వరకు కనీసం బస్సు, ఆటో సర్వీసులు లేవని.. అలాంటి గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. తాము ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లు, ప్రహరీలను కూల్చి వేయడం తగదని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. ఈక్రమంలో స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రహరీ వరకే కూల్చేసి అధికారులు వదిలేశారు. అయితే కూలీ నాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చేస్తుండటంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ ఆవేదనను పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంతో కష్టపడి కట్టుకున్న తమ ఇంటికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా, కక్ష పూరితంగా కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనసేనాని పవన్ పర్యటన తర్వాత కూడా..
గత ఏడాడి మార్చి 14వ తేదీన ఇప్పటం గ్రామస్థులు జనసేన ఆవిర్భావ సభ కోసం వారి పొలాలను ఇచ్చారు. ప్రభుత్వ ఆంక్షలతో అప్పట్లో జనసేన సభ పెట్టుకునేందుకు ఎక్కడా స్థలాలు లభ్యం కాలేదు. ఈ సమయంలో ఇప్పటం ప్రజలు ముందుకొచ్చి భూములు ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత ప్రభుత్వం కక్షపూరితంగా గ్రామస్థుల ఇళ్లను కూల్చివేసేందుకు యత్నించగా.. జనసేన, టీడీపీ పార్టీలు అడ్డుకున్నాయి. ఆ సమయంలో స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వచ్చి.. కూల్చివేసిన ఇళ్లను నేరుగా పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వ గ్రామస్థుల ఇళ్లను కూలగొడుతోందని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కొన్నాళ్లు ఇళ్ల జోలికి అధికారులు వెల్లలేదు. అయితే ప్రస్తుతం మరోసారి మిగిలిన ఇళ్ల ప్రహరీలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై గ్రామస్థులు మండిపడుతున్నారు.