సీపీ చౌహాన్‌ను నిలువరించిన కానిస్టేబుల్‌.. ఫోన్‌ ఇవ్వాలని ఆర్డర్‌!

తెలంగాణలో టెన్త్‌ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు గట్టి భందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షకు వచ్చే విద్యార్థులను, ఇన్విజిలేటర్లు, అధికారులను గేటు ముందే క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వతే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ పోలీసులు సైతం పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు తమ ఫోన్లను బయటే వదిలి వెళ్లాలనే నిబంధనను అందరూ పాటిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఇవాళ ఆంగ్ల పరీక్ష ఉదయం ప్రారంభమైంది. అయితే.. ఓ పరీక్ష సెంటర్‌ వద్ద పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు రాచకొండ సీపీ చౌహన్ వెళ్లగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆయన్ని నిలువరించడం ఆసక్తికరంగా మారింది. పరీక్ష కేంద్రంలోకి ఫోన్‌ అనుమతి లేదని.. ఫోన్‌ ఇక్కడ పెట్టిలోపలికి వెళ్లాలని కానిస్టేబుల్‌.. సీపీకి చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి స్పందించిన సీపీ చౌహన్‌ విధులు నిబద్దతతో అమలు చేస్తున్న ఆ మహిళా కానిస్టేబుల్‌ను అభినందించారు. తన పైఅధికారి అని కూడా చూడకుండా నిబంధనలను కఠినంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. ఆ తర్వాత తన ఫోన్ ను ఆమెకు ఇచ్చి, పరీక్ష కేంద్రానికి సీపీ చౌహాన్‌ వెళ్లారు. పరీక్ష నిర్వహణను సమీక్షించిన సీపీ.. బయటికొచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్ కు రివార్డ్ అందజేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్బంగా పలువురు మహిళా కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు. ఇలాంటి అధికారులుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.