కట్నం తక్కువైందని పెళ్లికి నో చెప్పిన వధువు.. పాపం వరుడు!

సాధారణంగా అమ్మాయి తరపు వారు అబ్బాయికి నగదు లేదా స్థల రూపేణా, బంగారం, ఇతర రూపాల్లో ఇచ్చేదాన్ని కట్నం అంటారు. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు చట్టరీత్యా నేరమైనప్పటికీ దాన్ని ఎవరూ పాటించరు. అయితే.. ప్రస్తుతం అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య తక్కువ కావడంతో యువతులకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. కొందరు పురుషులు ఆస్తులు, కులాలు, కట్నం వంటి పట్టింపులు లేకుండా.. అమ్మాయి దొరికితే చాలు అన్నట్లు ఎవరొకరిని పెళ్లి చేసేసుకుంటున్నారు. అదే అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటే.. ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకునేవారు లేకపోలేదు. ఇక ఇదే కోవకు చెందిన ఓ కుటుంబం అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిచేసుకునేందుకు సిద్దమైంది. ముందుగా అడిగిన మేరకు కట్నం డబ్బులు వధువు కుటుంబానికి ఇచ్చేశారు. తీరా పెళ్లి పీటలు మరికొద్దిసేపట్లో ఎక్కుతారు అనగా.. పెళ్లి కుమార్తె తనకు అదనపు కట్నం కావాలని డిమాండ్‌ చేసి వరుడికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఆ వరుడు, వధువు ఎవరు? కట్నం ఎంత డిమాండ్‌ చేసింది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

హైదరాబాద్‌ దగ్గర్లోని మేడ్చ‌ల్ జిల్లాలోని పోచారం గ్రామానికి చెందిన యువకుడికి.. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువ‌తితో ఇటీవల పెళ్లి నిశ్చ‌యమైంది. అయితే వ‌రుడి కుటుంబ సభ్యులు వ‌ధువుకు రూ. 2 ల‌క్ష‌లు క‌ట్నంగా ఇస్తామని పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒప్పందం చేసుకున్నారు. తీరా గురువారం అనగా.. ఈనెల 9న రాత్రి 7:21 గంట‌ల‌కు ఘట్‌కేసర్‌లో వీరి వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు. అందుకు ఘ‌ట్‌కేస‌ర్‌లోని ఓ ఫంక్ష‌న్ హాల్‌ను అబ్బాయి తరపు వారు బుక్‌ చేసుకున్నారు.

ఇంకో గంటలో పెళ్లి అనగా..
ముహుర్త స‌మ‌యానికి గంట ముందే వ‌రుడితోపాటు అత‌ని కుటుంబ స‌భ్యులు ఫంక్ష‌న్ హాల్‌కు చేరుకున్నారు. కానీ వ‌ధువు, ఆమె కుటుంబ స‌భ్యులు రాలేదు. ముహుర్తానికి స‌మ‌యం స‌మీపిస్తుండటంతో.. వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌కు వ‌రుడి బంధువులు ఫోన్‌ చేశారు. సరిగ్గా పెళ్లి ఇంకో గంటలో ఉందనగా.. ఆ నవ వధువు.. వ‌రుడికి షాకిచ్చింది. త‌న‌కు ఇచ్చిన రెండు లక్షల క‌ట్నం స‌రిపోదని.. ఈ పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ఆమె తేల్చి చెప్పేసింది. అద‌నపు క‌ట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటా లేదంటే లేదు.. అని చెప్పడంతో చివరికి పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది.

రూ. 2 ల‌క్ష‌ల‌ను వ‌దులుకున్నారు..
పెళ్లికి ముందే కట్నం డబ్బులు ఇచ్చేసిన వరుడి బంధువులు తాము మోసపోయినట్లు గ్రహించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వ‌ధువు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు స్టేష‌న్‌కు ర‌ప్పించారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసిన‌ప్ప‌టికీ వ‌ధువు మ‌న‌సు మార‌లేదు. దీంతో ముందుగా ఇచ్చిన రూ. 2 ల‌క్ష‌ల‌ను కూడా వ‌రుడి కుటుంబ స‌భ్యులు వ‌దులుకున్నారు. అనంత‌రం ఎవ‌రి దారిన వారు వెళ్లిపోతూ.. పాపం వరుడి పరిస్థితి ఏంటో అని జాలీగా అతన్ని అందరూ ఓదార్చారు.