ఏపీ, తెలంగాణల్లో పది ప్రశ్నాపత్రం లీక్‌!

ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ పరిధిలోని పరీక్షా పత్రాల లీకైజీ విషయంలో ఎన్నో విమర్శలు, ఆరోపణలను మూటగట్టుకుంటున్న కేసీఆర్‌ సర్కార్‌పై మరో అపవాదు వచ్చి పడింది. ఇవాళ్టి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయ. ఈక్రమంలో వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇన్విజిలేటర్‌ సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోని తీసుకెళ్లి.. పరీక్ష పత్రాన్ని ఫొటో తీసినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎగ్జామ్‌ సెంటర్‌ సూపరింటెండెంట్‌ను, ఇన్విజిలేటర్‌ను తొలిగిస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకుంది. క్వశ్చన్‌ పేపర్‌ లీకేజ్‌పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టెన్త్‌ పేపర్‌ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పరీక్ష మొదలైన ఏడు నిమిషాల్లో పేపర్‌ బయటకు వచ్చిందని పోలీసులు గుర్తించారు.

పదో తరగతి పరీక్ష ఇవాళ ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాగా.. 9:37 గంటలకు పేపర్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో కొందరు షేర్‌ చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్‌ హాల్‌ నుంచి పేపర్‌ పంపినందుకు ఇన్విజిలేటర్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్‌ తాండూరులో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్‌లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రభుత్వ పాఠశాల పనిచేసే సైన్స్‌ ఉపాధ్యాయుడు బందెప్ప ఫోన్‌ నుంచి ప్రశ్నపత్రం లీకైనట్లు తెలిపారు. అతన్ని వెంటనే విధుల నుంచి తప్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద తాండూరు 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ బయటకు వెళ్లిన ఘటనలో ముగ్గురు సస్పెండ్ అయ్యారన్నారు. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, మరోకరిపై వేటు పడిందన్నారు. అయితే.. ఇన్విజిలేటర్గా ఉన్న బందప్ప మీద గతంలోను ఆరోపణలు ఉన్నాయి.. 2017లో బందప్ప మీద పోక్సో కేసు నమోదై ఉంది.

నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అదేశం..
పరీక్ష సమయం పూర్తవకముందే పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్‌ నారాయణరెడ్డిని విద్యాశాఖ ఆదేశించింది. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ.. వారిని పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో ఇలా..
క‌డ‌ప‌ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ప‌దో త‌ర‌గ‌తి తెలుగు ప్రశ్నప‌త్రంలోని ప్రశ్నలకు మైక్రో జిరాక్స్ స‌మాధాన పత్రం ప్రత్యక్షం కావడం సంచలనంగా మారింది. ప్రశ్నాపత్రం బయటకు రావడంతో.. జవాబులను కాపీ కొట్టేందుకు కొందరు మైక్రో జిరాక్స్ తీయిస్తుండగా.. విషయం వెలుగులోకి వచ్చింది. స‌మాధానాల‌ను నెంబ‌ర్ల వారీగా త‌యారు చేసిన ఆగంత‌కులు… జిరాక్స్ తీస్తుండ‌గా వెలుగులోకి వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై క‌డ‌ప డీఈవో రాఘ‌వ‌రెడ్డి స్పందించారు. పేపర్‌ లీకేజీలు జిల్లాలో ఎక్కడా జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు. తన దృష్టికి అలాంటివి రాలేదన్నారు.