నిఘా నీడలో తెలంగాణ పది పరీక్షలు

ఇప్పటికే టీఎస్‌పీఎస్‌ పరీక్ష పత్రాలు లీకై కేసీఆర్‌ సర్కార్‌పై అన్ని పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు రావడంతో… పదో తరగతి పరీక్షలను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్ల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంతి వివరించారు.

ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం..
పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయని, 9:35 గంటల వరకు మాత్రమే విద్యార్థులను అనుమతిస్తామని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. పది పరీక్షల హాల్ టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించామని, వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు లోను కాకుండా సంసిద్ధం కావాలని సూచించారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు.

పరీక్ష పత్రాల్లో మార్పులు ఇలా..
ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షా పేపర్లను 11 నుంచి 6 పేపర్లకు కుదించినట్లు మంత్రి తెలిపారు. సైన్స్ పరీక్షా రోజున భౌతిక శాస్త్రం, జీవశాస్త్రంకు సంబంధించి ప్రశ్నాపత్రాలు, బుక్‌లెట్‌లను వేర్వేరుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సమీప కేంద్రాల్లోనే విద్యార్థులు పరీక్షలు రాసేలా ఏర్పాటు చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.