చరిత్రను కళ్ల ముందు దించేసారు..!
సినీ పరిశ్రమలో రూపొందే ప్రతి సినిమాకీ ఓ నేపథ్యం ఉంటుంది. కొన్ని సినిమాలు ప్రేమకథలు ఇతివృత్తంగా తెరకెక్కితే మరికొన్ని క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ జానర్లతో రూపొంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఎన్ని సినిమాలు తెరకెక్కించినా చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమే. భారత, రామాయణ, భాగవత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఎన్నో పౌరాణిక సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన సినిమా శాకుంతలం. శకుంతల కుమారుడైన భరతముని పేరు మీదనే మన దేశానికి భారతదేశం అనే పేరొచ్చిందని చరిత్ర చెబుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన తెలుగు సినిమాలేవో ఓ లుక్కేద్దాం..
శాకుంతలం
సమంత హీరోయిన్‌గా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దేవ్ మోహన్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో శాకుంతలం 3డీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు గుణశేఖర్. రామాయణం ఇతిహాసం ఆధారంగా చిన్నపిల్లలతో రామాయణం రూపొందించిన గుణశేఖర్‌కి భారత చరిత్ర ఇతిహాసాలపై ప్రత్యేక ఆసక్తి. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ దేవి కథ ఆధారంగానూ ‘రుద్రమ దేవి’ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో రుద్రమ దేవిగా అనుష్క మెప్పించగా ప్రధాన పాత్రల్లో దగ్గుబాటి రానా, అల్లు అర్జున్ మెప్పించారు. గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఈ పాత్రకు పలు అవార్డులు కూడా అందుకున్నారు.
బింబిసార
టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా బింబిసార. కల్యాణ్‌రామ్ హీరోగా కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించారు. 2022, ఆగస్టులో విడుదలైన బింబిసార సినిమాను 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి బింబిసారుడు అనే రాజు కథ నేపథ్యంలో తెరకెక్కించారు.
సైరా నరసింహారెడ్డి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించారు. నయనతార హీరోయిన్‌గా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో బిగ్ బీ అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, అనుష్క, విజయ్ సేతుపతి కీలకపాత్రలు పోషించారు.
గౌతమీ పుత్ర శాతకర్ణి
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి. శ్రియ శరణ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కుంతల రాజ్యాన్ని జయించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.