Secretariat: ఇంద్రభవనంలా కొత్త సచివాలయం.. ఎన్ని ప్రత్యేకతలో!
Hyderabad: తెలంగాణ(telangana)లో నిర్మితమైన కొత్త సచివాలయం(new secretariat) .. ఇంద్రభవనంలా కనిపిస్తోంది. చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను తలపించే తెలంగాణ సెక్రటేరియట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సచివాలయం 28 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉండగా.. అందులో 8 ఎకరాల మేర పచ్చదనంతో నిండి ఉంది. 265 అడుగుల ఎత్తులో, 6 అంతస్థులతో, అత్యాధునిక వసతులతో, అబ్బురపరిచే హంగులతో రూపుదిద్దుకుంది. సర్వమత సమ్మేళనానికి సంకేతంగా నూతన సచివాలయం చుట్టూ మందిర్, మసీద్, చర్చిల నిర్మాణం పార్లమెంట్ తరహాలో రెడ్ శాండ్ స్టోన్‌తో రెండు వాటర్ ఫౌంటెయిన్ల నిర్మాణాలు ఉన్నాయి. ఇండో పర్షియన్ శైలిలో ప్రధాన భవనాలపై భారీ డోముల నిర్మాణం. డా. బీఆర్ అంబేడ్కర్ పేరుతో.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మితమైన సచివాలయం ఏప్రిల్ 30వ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
దీర్ఘ చతురస్రాకారంలో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్థుల్లో.. అత్యుత్తమ దక్షిణభారత సంప్రదాయంలో, దక్కన్ కాకతీయ శైలిలో, మనోహరమైన రీతిలో, భారీ డోములతో రూపుదిద్దుకున్న శ్వేతసౌధం తెలంగాణ ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తోంది. అత్యంత సుందరంగా వెలసిన ఈ భవనాన్ని చూస్తూ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన కార్మికులు సైతం మురిసిపోతున్నారు.