తెలంగాణకు కొత్త సచివాలయం: త్వరలో సీఎం ప్రకటన
ఎట్టకేలకు తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతనంగా నిర్మించిన సచివాలయానికి డా. బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. సచివాలయ ప్రారంభోత్సవం తేదీల్లో మార్పులు చేస్తూ.. వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రస్తుతం ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఈనేపథ్యంలో ఇవాళ కేసీఆర్ నూతన సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ తాతా మధు, సీఎస్ శాంతి కుమారి, సీపీ సీవీ ఆనంద్ తదితరులు సీఎం వెంట ఉన్నారు.
రూ. 617 కోట్లతో నూతన సచివాలయ నిర్మాణం..
పాత సచివాలయాన్ని కూల్చి దాదాపు రూ. 617 కోట్లతో కనీవినీ ఎరగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టింది. అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయి.
పలుమార్లు వాయిదా పడుతూ..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ముందుగా సీఎం భావించారు. అయితే అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతోపాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం లాంటివి నాడు సచివాలయ ప్రారంభోత్సవం వాయిదాపడేందుకు కారణమయ్యాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకావడం జరిగింది. దాంతో తాజా ఎన్నికల కోడ్ కారణంగా రెండోసారి ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే.. ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసినట్లు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. ఆ తర్వాత జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.