అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. దేశంలో బీజేపీ మాత్రమే అధికారంలో ఉండాలని.. ప్రతిపక్షాలను లేకుండా చూడాలని ప్రధాని మోదీ చూస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదని, మోదీ సమన్లు అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలపై కేసులతో దాడి – జనాలపై ధరల దాడి చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం అని విమర్శలు గుప్పించారు. మోదీ చేతిలో సీబీఐ కీలు బొమ్మ.. ఈడీ తోలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. నీతిలేని పాలనకు.. నిజాయతీ లేని సంస్థలపై తాము నిత్యం పోరాటం చేస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ పార్టీలపై సుమారు 5421 కేసులు ఈడీ, సీబీఐ నమోదు చేశాయని.. అవినీతిని రూపు మాపడం పక్కనుంచి.. ప్రతిపక్షాలను లేకుండా చేయాలని దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన కేటీఆర్‌ ఆరోపించారు.

అదానీపై దర్యాప్తు చేసే ధైర్యం ఉందా..
గౌతం అదానీ పేరును ప్రస్తావిస్తూ.. మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అదాని అవినీతి సంపాదనపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేసే దమ్ము ప్రధాని మోదీకి ఉందా అంటూ ఆయన సవాల్‌ విసిరారు. ముంద్రా పోర్టులో రూ. 21వేల కోట్ల డ్రగ్స్‌ దొరికితే అదానీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సాధారణంగా ఒకటి, రెండు పోర్టులను మాత్రమే ఒక గుత్తేదారుడికి ఇస్తారని.. అలాంటిది అదానీకి ఆరు, ఏడు పోర్టులను ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. మోదీ బినామీ అదానీ అని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు బీజేపీ చేరితే వారిపై కేసులు ఉండవని.. కేవలం ఇతర పార్టీల్లో ఉన్న నేతల ఇళ్లపైన ఆస్తులపైన ఈడీ, సీబీఐ దర్యాప్తులు నిర్వహిస్తాయని మండిపడ్డారు. దీంతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితోనే అదానీకి ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందని, దానిపై చర్యలేవని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ వస్తాయని, మీడియాను సైతం వదలరని విమర్శించారు. అదానీతో ఒప్పందం అంటే.. గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్‌ అన్నట్లే అని శ్రీలంక ప్రతినిథి చెప్పడాని ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. 2014 తర్వాత 95 శాతం ఈడీ దాడులు విపక్షాలపైనే జరిగాయని కేటీఆర్‌ తెలిపారు.