ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCPకి షాక్!
AP MLC Election Results 2023: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో టీడీపీ నుంచి పోటీ చేసిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లు పొంది అనూహ్యంగా గెలుపొందారు. దీంతో టీడీపీ శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకొంటున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్లోనూ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీ… ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్సాహ నిండింది.
వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది..
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకోవడంతో ఈ ఫలితాలపై చర్చ మొదలైంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రాగా.. వాస్తవానికి టీడీపీ బలం 19 మంది సభ్యులే.. ఈక్రమంలో వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు నాలుగు, జనసేన అభ్యర్థి ఓటు వైసీపీకే పడుతుందని అందరూ భావించగా.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు ఎవరికి వేశారో తెలియన పరిస్థితి. ఈక్రమంలో అనురాధకు 23 ఓట్లు రావడంతో వైసీపీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుకుంటున్నారు. మరోవైపు సుమారు 16 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారంటూ టీడీపీ ముందు నుంచే చెబుతోంది. కానీ ఇదంతా మైండ్ గేమ్ అని వైసీపీ కొట్టి పారేస్తోంది. కానీ చివరికి టీడీపీ అభ్యర్థిని గెలుపుతో టీడీపీ ఒక మెట్టు ఎక్కినట్లే కనిపిస్తోంది.
పంచుమర్తి అనురాధ గురించి కొన్ని విషయాలు
పంచుమర్తి అనురాధ 2000 సంవత్సరంలో అతి పిన్న వయసులో విజయవాడ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె ఆంధ్రప్రదేశ్ కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా 23 ఓట్లతో విజయం సాధించారు.